RRR మూవీకి మరో షాక్.. రిలీజ్ మరోసారి వాయిదా? కారణం ఏమిటంటే
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మరోసారి నిరాశ కలిగించే వార్త వినిపిస్తున్నది. గత రెండేళ్లలో పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి విడుదల వెనక్కి జరిగినట్టు వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

రౌద్రం రణం రుధిరం మూవీకి అడ్డంకులు
రౌద్రం రణం రుధిరం (RRR) మూవీ ఏ ముహుర్తాన మొదలుపెట్టారో గానీ.. ఈ సినిమాకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. హీరోయిన్ మార్పు, ఎన్టీఆర్; రాంచరణ్ గాయాల పాలు కావడం లాంటి అంశాలు సినిమా షూటింగు వాయిదా పడేలా చేశాయి. దాంతో తొలుత అనుకొన్న రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. అలా పలు మార్లు వాయిదా పడుతున్న సమయంలో కరోనావైరస్ ఫస్ట్ వేవ్ మరింత దెబ్బ తీసింది.

RRR రిలీజ్ డేట్ మార్చి...
కరోనా ఫస్ట్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టిన క్రమంలో RRR షూటింగును శరవేగంగా నిర్వహించారు. దాంతో ఈ సినిమాను అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు, అలాగే అలియాభట్ షూటింగ్‌కు హాజరుకాకపోవడం లాంటి సమస్యలతో మళ్లీ రిలీజ్ డేట్ మార్చి సంక్రాంతి 2022 కానుకగా అందించాలని ప్లాన్ చేశారు.

RRRపై కరోనా సెకండ్ వేవ్ దెబ్బ
ఎస్ఎస్ రాజమౌళి వేసుకొంటున్న ప్రణాళిక ఒకటుంటే.. కరోనా కారణంగా మరో విధంగా తయారవుతూ వస్తున్నది. పక్కా ప్రణాళికతో సాగుతున్న షూటింగుపై కరోనావైరస్ సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. దాంతో ఈ సినిమాను ఏప్రిల్ 2022లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో అది సాధ్య పడే అవకాశం లేదనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

RRR పనులకు బ్రేక్..
కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో అర్ధం కాని పరిస్థితి ఉంది. RRRకు సంబంధించిన షూటింగు షెడ్యూల్స్ ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి. అలాగే పోస్టు ప్రొడక్షన్ పనులకు కూడా బ్రేక్ పడింది. దాంతో మళ్లీ రిలీజ్ డేట్ మారే అవకాశం కనిపిస్తున్నది.
Recommended Video

బాలీవుడ్‌లో ప్రతికూల పరిస్థితులు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనావైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. బాలీవుడ్‌లో పలు సినిమాలు రిలీజ్ కాకుండా నిలిచిపోయాయి. ఈ క్రమంలో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కావాలంటే రకరకాల అడ్జస్ట్‌మెంట్స్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ సినిమాను మే 2022లో గానీ, ఆ తర్వాత గానీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











