త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంయుక్త మీనన్? కాబోయే భర్త ఎవరంటే?
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు వరుసపెట్టి పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డిని పెళ్లాడారు. త్వరలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి జరగనుంది. అటు మిగిలిన ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు, ఇతర సెలబ్రిటీలు కూడా తమ బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వైవాహిక బంధంతో ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా, గోల్డెన్ హ్యాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె సినిమాలో నటిస్తే ఖచ్చితంగా ఆ మూవీ హిట్ అనే సెంటిమెంట్ చిత్ర పరిశ్రమలో సంయుక్తను ప్రత్యేకంగా నిలబెడుతోంది. తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసిన సంయుక్తకు భీమ్లా నాయక్ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ దొరికింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - రానా కలిసి నటించిన ఈ సినిమాలో రానాకు జోడీగా సంయుక్త నటించారు. ఈ సినిమా విజయం సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి.

బింబిసార, సార్, అఖండ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆచితూచి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ తన ప్రత్యేకత చాటుతోంది సంయుక్త మీనన్. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ స్వయంభుతో పాటు, పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతిల స్లమ్ డాగ్ మూవీలో నటిస్తున్నారు సంయుక్త. ఇవి కాకుండా హిందీలో మహారంగీ : క్వీన్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్, తమిళంలో బెంజ్ సినిమాలలో నటిస్తున్నారు.
ఇదిలాఉండగా.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్దిలో ఐటెం సాంగ్ చేసే అవకాశం సంయుక్త మీనన్‌కు దక్కింది. తమన్నా భాటియా, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లను దాటుకుని ఆమెకు ఈ ఛాన్స్ దొరికింది. రామ్ చరణ్‌తో సంయుక్త ఎలా ఆడిపాడతారు? ఆయన గ్రేస్‌తో ఎలా మ్యాచ్ చేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ ఐటెం సాంగ్ పూర్తి చేసి సినిమాకు గుమ్మడి కాయ కొట్టేయాలని పెద్ది యూనిట్ పట్టుదలగా ఉంది.
కెరీర్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్న సంయుక్త మీనన్.. వ్యక్తిగత జీవితంపై పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి. గతంలో పెళ్లయిన ఓ స్టార్ హీరోతో సంయుక్త రిలేషన్‌లో ఉందని గాసిప్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఓ తమిళ హీరోతో డేటింగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే పెళ్లిపై ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదని తర్వాత చూద్దామని అందరి నోళ్లు మూయించారు సంయుక్త. దాంతో ఆమె పెళ్లి వార్తలు సద్దుమణిగాయి. అయితే తాజాగా మరోసారి సంయుక్త పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి.
త్వరలోనే సంయుక్త మీనన్ పెళ్లి చేసుకోబోతోందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ ఓ వ్యక్తితో చాలా ఏళ్లుగా రిలేషన్‌లో ఉందని, ఇండస్ట్రీకి తెలియకుండా తమ బంధాన్ని గుట్టుగా ఉంచిందని, అతనితో త్వరలోనే పెళ్లి పీటలెక్కాలని నిర్ణయించుకుందని గాసిప్స్ వస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన్న మాదిరిగానే నట జీవితాన్ని కొనసాగిస్తుందని ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్‌గా పీక్స్‌లోన్న సంయుక్త పెళ్లి చేసుకుంటుందా? చేజేతులా కెరీర్ పడుచేసుకుంటుందా? ఈ వార్తల్లో ఉన్న నిజమెంత తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications



