మెగాస్టార్ 150వ సినిమాకు శంకర్ ఒప్పుకున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం మరోసారి చర్చనీయాంశం అయింది. ఇటీవల బెంగుళూరు వెళ్లిన మెగాస్టార్ అక్కడ అభిమానులతో తన 150వ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. చిరు సినిమాకు సంబంధించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ర్కిప్టు రెడీగా ఉందని, అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే చిరంజీవి 150వ సినిమా ప్రకటన చేశారని అంటున్నారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే విషయమై ఫిల్మ్ నగర్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇంకా దర్శకుడు కన్ ఫర్మ్ కాక పోవడం వల్లనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని సమాచారం. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈచిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో రోబో ఆడియో ఫంక్షన్లో...ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందని చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. తన తాజా సినిమా 'స్నేహితుడు' ఆడియో ఫంక్షన్లో భాగంగా శంకర్ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఈ వేడుకకు హాజరైన నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఆయనతో సపరేట్ గా భేటీ అయి మాట్లాడారు. చిరంజీవి 150వ చిత్రాన్నికి దర్శకత్వం వహించే విషయం ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా చేయడానికి శంకర్ ఒప్పుకున్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన సినిమా ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు అభిమానుల కోరిక నెరవేర్చేందుకు కమర్షియల్ అంశాలతో పాటు, తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగ పడేలా మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ చిత్రం ఉండాలని చిరంజీవి కోరుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











