Nandamuri Balakrishna : రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణేనా?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారంలో ఉన్నన్ని రోజులు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉండేవారు. టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, ఇతర వ్యవహారాల్లో టాలీవుడ్ ఏం అడిగితే అది చేసి పెట్టేవారు కేసీఆర్. ముఖ్యంగా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు తెలుగు చిత్ర పరిశ్రమకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో సఖ్యతగానే ఉండాలని ప్రయత్నించారు. గతంలో మాదిరిగానే సినీ పెద్దలు ఏం అడిగితే అది చేసి పెడుతున్నారు. చివరికి నంది అవార్డులను కూడా తిరిగి పునరుద్ధరించాలని అడగ్గా మరో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. కాకపోతే నంది అవార్డులకు బదులు గద్ధర్ అవార్డ్ పేరిట కార్యక్రమం నిర్వహించుకుందామని చెప్పగా టాలీవుడ్ నుంచి స్పందన లేదు. దీనిపై రేవంత్ సైతం బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.

ఇలాంటి దశలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, భూముల ఆక్రమణల సంగతి తేల్చేందుకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా వ్యవహారం జాతీయంగా కలకలం రేపింది. పలువురు ప్రముఖులకు చెందిన అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లను నడిపించిన రేవంత్ రెడ్డి ఈ దశలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పలుమార్లు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణల గురించి రేవంత్ పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యాక్షన్‌లోకి దిగారు.
తర్వాత మురళీ మోహన్‌కి కూడా నోటీసులు వెళ్లడంతో ఆయన స్వచ్ఛందంగా నిర్మాణాలను కూల్చివేసేందుకు అంగీకరించడంతో హైడ్రా వెనక్కి తగ్గింది. తర్వాత సినీ పరిశ్రమ సైలెంట్ అయిపోయింది. ఈ దశలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. పుష్ప2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ వివాహిత మరణించడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఏ11గా అల్లు అర్జున్‌ని చేర్చిన చిక్కడపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ సైతం షాక్ అయ్యారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలుకు వెళ్లకుండా తప్పించుకోగలిగారు.
ఈ పరిణామాలతో టాలీవుడ్‌కు రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరికలు పంపినట్లయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి నెక్ట్స్ టార్గెట్ మరో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలోనే బాలయ్య నివాసం ఉంది. అయితే పెరిగిపోతున్న ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
ఇందుకోసం ప్రైవేట్ ఆస్తులను కూల్చివేసి భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆ మార్గంలోని నివాసాలు, వ్యాపార సంస్థల కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఎక్కడెక్కడ భూసేకరణ చేయాలో అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే బాలకృష్ణ నివాసానికి కూడా మార్కింగ్ చేసినట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ స్వయంగా రేవంత్ రెడ్డి గురువు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి స్వయానా బావమరిది, అలాగే తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీలో కీలక సభ్యుడు. అలాంటి బాలయ్యను రేవంత్ రెడ్డి టచ్ చేస్తారా అంటూ చిత్ర పరిశ్రమలో ఓ రేంజ్‌లో డిస్కషన్ నడుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











