జాన్వీ కపూర్ పెద్ది రెమ్యునరేషన్.. రామ్ చరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ అందాల తార, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే, సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. తన మార్కెట్‌ను వేగంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు 'దేవర' సినిమాతో పరిచయమైన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మూవీ జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో జాన్వీ కపూర్ రెమ్యూనరేషన్ చర్చనీయంగా మారింది.
'పెద్ది'.. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కుతోంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. సినిమా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉందని సమాచారం. దాదాపు రూ.350 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఎంపిక, వారి పారితోషికం గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. ప్రస్తుతం 'పెద్ది' సినిమా విడుదలకు ముందు నటీనటుల పారితోషికాలు కూడా భారీగానే ఉన్నాయని టాక్. రామ్ చరణ్ అత్యధికంగా రూ.100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్టు టాక్. ఈ క్రమంలో జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ గురించి కూడా సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు జాన్వీ కపూర్ సుమారు రూ.6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
'దేవర' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీకి అదే తొలి తెలుగు సినిమా. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాకు ఆమె రూ.5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 'పెద్ది' కోసం మరో కోటి రూపాయలు పెంచి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. జాన్వీ కపూర్‌కు ప్రస్తుతం నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతోంది. సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉండటం, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పెరగడం, యువతలో మంచి క్రేజ్ ఉండటం వంటి అంశాలు ఆమె రెమ్యునరేషన్ పెరగడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
మరోవైపు, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోయే భారీ ప్రాజెక్ట్ కోసం కూడా జాన్వీ కపూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాకు ఆమె రూ.7 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, జాన్వీ కపూర్ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే యువ హీరోయిన్ల జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 'పెద్ది' సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటే, జాన్వీ కపూర్ మార్కెట్ మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఆమె రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications



