నాని 'జెండాపై కపిరాజు' దీ అదే పరిస్ధితి
హైదరాబాద్ : నాని సినిమాలేంటో వరసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. పైసా చిత్రం అలాగే ఎన్నో రిలీజ్ తేదీలు మార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే పరిస్ధితి నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు' కి ఏర్పడుతోంది.. అమలా పాల్ తో నాని కలిసి చేసిన 'జెండా పై కపి రాజు'చిత్రం మార్చి 7 న విడుదల అవబోతోందంటూ ప్రకటనలు వచ్చాయి . కాని ఈ ద్వి బాషా చిత్రం కొన్ని టెక్నికల్ కారణాలతో అనుకున్న తేదీకి థియోటర్స్ కి రావటం లేదని సమాచారం. మార్చి 28 చిత్రం విడుదల చేయటానికి నిర్ణయించారు.
మల్టి డైమన్షన్స్ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. నాని రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో కాస్త గ్యాప్ ఇవ్వాలని ఈ నిర్ణయిం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా ప్రకటన రాలేదు. అయితే తమిళంలో మార్చి 7న మొదట అనుకున్నట్లుగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అక్కడ రిజల్ట్ ని బట్టి కూడా ఇక్కడ జయాపజయాలు నిర్ణయం అవుతాయి. ఈ చిత్రానికి బిజినెస్ కూడా అనుకున్న రీతిలో జరగలేదని తెలుస్తోంది.

నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ...ఇప్పటికి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని ఇందులో చేసే రెండు పాత్రలూ చాలా వైవిధ్యంగా ఉంటాయి. శరత్‌కుమార్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పారు.
ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు. అమలాపాల్ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎస్.శివరామ్ నిర్మాతలు. ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్, శివబాలాజీ, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్, కూర్పు: ఫాజల్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్.


Click it and Unblock the Notifications











