జూ ఎన్టీఆర్ ‘రభస’ ఓకే అయిందా?
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'రభస' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని, కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ 'రభస' టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించారు నిర్మాతలు.
రభస చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించనుంది. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న ఈచిత్రం జులై లేదా ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఆ మధ్య 'కందిరీగ' సినిమాకు సంతోష్ శ్రీనివాస్ సీక్వెల్ తీయబోతున్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ తర్వాత వారు తమ ప్రాజెక్ట్ నుంచి హీరో రామ్ ను తప్పించి, ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. 'కందీరీగ-2′ ను రద్దు చేసుకుని, అందుకోసం రూపొందించుకున్న స్క్రిప్ట్ ను 'రభస'గా మార్చుకుని ఎన్టీఆర్ ను సంప్రదించారట దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా...ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











