త్రివిక్రమ్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్?
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుండి. ప్రస్తుతం ఇది కథా చర్చల దశలో ఉందని, ఖరారైన తర్వాత అధికారిక సమాచారం వెలువడనుందని అంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్‌తో 'అత్తారింటికి దారేది' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత పవన్ కళ్యాణ్ సొంత బేనర్లో 'కోబలి' అనే మరో సినిమా కూడా కమిట్ అయ్యారు. వీటి తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని హారిక- హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ నిర్మించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
గతంలోనూ ఇలాంటి వార్తలే వినిపించాయి. కెఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ పై జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారని అన్నారు. కానీ ఆ వార్తలు ఆచరణకు నోచుకోలేదు. మరి ఈ సారైనా ఈ ప్రతిపాదనలు నిజమవుతాయో లేదో చూడాలి.
చేసింది తక్కువ సినిమాలే అయినా...తనదైన దర్శకత్వం, పంచ్ డైలాగులతో పాపులర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. భారీ ఫ్యాన్ ఫోలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్‌తో సినిమా చేయడం వల్ల అంచనాలే భారీగా ఉంటాయని, మంచి ఫలితాలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడి మండువా లోగిలిలో ప్రధాన తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











