Devara Special Shows : జూ.ఎన్టీఆర్ అభిమానులకు షాక్.. దేవర అర్ధరాత్రి షోలు రద్దు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన మూవీ దేవర. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ .. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్లుగానే అభిమానులు ఈ సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్నారు. అయితే థియేటర్ యజమానుల కక్కుర్తి కారణంగా ఫ్యాన్స్‌కి షాక్ తగిలింది. ఈ వివరాల్లోకి వెళితే..
దేవర ద్వారా జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెన్సార్ బోర్డ్ దేవరకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. ఏమాత్రం మౌత్ టాక్ బాగున్నా దేవర కలెక్షన్ల ఊచకోత మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నెల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. ఈ విషయంలో చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు 10 లక్షల టికెట్లను విక్రయించినట్లుగా బుక్ మై షో తెలిపింది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ టికెట్లు అమ్ముడైనట్లుగా బుక్ మై షో పేర్కొంది. హైదరాబాద్‌లో అయితే ఈ సినిమా కల్కి రికార్డులపై కన్నేసినట్లుగా ఉంది. కల్కి తొలి రోజు 1612 షోలను ప్రదర్శించగా.. దేవరకు 1616 షోలు వేయనున్నారు.
కల్కి రూ.19 కోట్లు ఓపెనింగ్స్ కొల్లగొట్టగా.. దేవర ఇప్పటికే రూ.15 కోట్లు వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో అయితే దేవర సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే దాదాపు 90 శాతం ఆక్యూపెన్సీ నమోదు చేయగా.. 47 వేల వరకు టికెట్లు అమ్ముడపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా దేవర రూ.1.15 కోట్లు వసూళ్లను ముందే రాబట్టినట్లుగా విశ్లేషకులు అంటున్నారు. సెప్టెంబర్ 26 నాటికి ఈ నెంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని టాక్.

ఇకపోతే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పెషల్ షోలు వేసుకునేందుకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు దేవర చిత్ర నిర్మాతలకు అనుమతులు ఇచ్చాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి 1 గంటకు ప్రత్యేక షోలు వేయడానికి అనుమతించింది. అయితే అభిమానుల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని థియేటర్ యాజమాన్యాలు అత్యుత్సాహానికి పోవడంతో కొంప మునిగింది.
హైదరాబాద్ భ్రమరాంబ - మల్లిఖార్జున థియేటర్‌లలో అర్ధరాత్రి 1 గంట షో టికెట్ ధరను రూ.2500గా నిర్ణయించారు. అయితే ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ లేకపోవడంతో థియేటర్ ఓనర్లు స్పెషల్ షోను రద్దు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అర్జున్, శ్రీరాములు థియేటర్‌లలోనూ 50 శాతం పైగా టికెట్లు మిగిలిపోవడంతో బుక్ మై షోలో టికెట్లను అందుబాటులో ఉంచాలని అనుకుంటున్నారని గాసిప్స్ వాైరల్ అవుతున్నాయి. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











