కమల్ ఎంట్రీతో వివాదం పరిష్కారమైంది.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు
తెలుగు సినీ చరిత్రలోనే చెప్పుకోదగిన సినిమాల్లో 'భారతీయుడు' ఒకటి. దీనికి కారణం అప్పట్లో భారతదేశంలో ఉన్న అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపించడమే. ఈ సినిమా లంచం తీసుకునే అధికారులు.. వాళ్లను ప్రోత్సహించే నాయకులు, ప్రజలపై అస్త్రాలు ఎక్కుపెట్టింది. అందుకే ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
ఇంతటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయాలని శంకర్- కమల్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు. దీనికి తగినట్లుగానే 'భారతీయుడు- 2' సినిమాను పోయిన ఏడాది మొదలుపెట్టారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది.

బడ్జెట్ గురించి వచ్చిన విబేధాల వల్లే 'భారతీయుడు- 2' ఆగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిలిచిపోయిన తర్వాత శంకర్.. లైకా ప్రొడక్షన్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయట. అయితే, కమల్ ఈ మధ్య ఇరువురితో వేరు వేరుగా సమావేశం అయినట్లు తెలిసింది. బడ్జెట్ విషయంలో ఇటు శంకర్‌తోనూ.. అటు నిర్మాణ సంస్థతోనూ ఆయన చేసిన సంప్రదింపులు సఫలం అయ్యాయట. ఈ కారణంగానే 'భారతీయుడు- 2' షూటింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'బిగ్ బాస్' తమిళం సీజన్ -3కి హోస్ట్‌గా ఉన్న కమల్.. చిత్ర షూటింగ్‌లోనూ పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











