అనుష్క, నయనతారకు చెక్.. మెగాస్టార్ అందాల భామగా కీర్తి సురేష్!
Recommended Video

మహానటి తర్వాత అందాల తార కీర్తీ సురేష్ క్రేజ్ దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో కూడా పెరిగిపోయింది. చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ స్థానాన్ని సంపాదించుకొని అగ్రతారగా బడా హీరోల సరసన ఆఫర్లను కొట్టేస్తున్నది. మహానటికి ముందు, తర్వాత ఆమె సాధించిన సక్సెస్‌లు నిర్మాతలకు భరోసానిస్తుండటంతో అవకాశాలు ఆమెను వెతుక్కొంటూ వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ పక్కన ఆఫర్ కొట్టేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా బాలీవుడ్‌లో రెండు భారీ ప్రాజెక్టులకు ఆమె పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఆ వార్తలకు సంబంధించిన పూర్తి వివరాలు..

సైరా మూవీ తర్వాత చిరంజీవితో
సైరా నర్సింహారెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. సైరా సినిమా ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. ఈ సినిమా కోసం ముందుగా నయనతార, అనుష్క పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. అయితే తాజాగా అనూహ్యంగా కీర్తీ సురేష్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

కీర్తీ సురేష్‌కే ఆఫర్ అని..
సైరాలో నయనతార నటిస్తున్నందున చిరంజీవి పక్కన ఫ్రెష్ హీరోయిన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మహానటి తర్వాత తమిళంలో సక్సెస్‌తో దూసుకెళ్తున్నందున కీర్తీ సురేష్ అయితే బాగుంటుందని, యూత్, మహిళా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండటం కూడా మరో కారణం అని తెలుస్తున్నది.

త్వరలో అధికారిక ప్రకటన
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కలయికలో వచ్చే చిత్రంలో కీర్తీ సురేష్ ఎంపిక ఖాయమై పోయిందని, అధికారికంగా వెల్లడించడమే తరువాయి అని చెప్పుకొంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు వివరాలు, సాంకేతిక నిపుణుల పేర్లను అధికారికంగా త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.

బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌తో
ఇది ఇలా ఉండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హీరోగా క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న బయోపిక్ చిత్రంలో నటించేందుకు కీర్తీ సురేష్ ఒకే చెప్పింది. హిందీలో 'బదాయి హో' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన అమిత్ శర్మ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించబోతున్నారు.

నాగేష్ కుకునూర్ చిత్రంలో కూడా
అలాగే ప్రముఖ దర్శకుడు నాగేష్ కుకునూర్ తెరకెక్కించే చిత్రంలో కూడా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. నాగేశ్ కుకునూర్ చెప్పిన కథ విన్న వెంటనే బాలీవుడ్ చిత్రంలో నటించడానికి కీర్తీ సురేష్ అంగీకరించిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్నది.


Click it and Unblock the Notifications











