కేజీఎఫ్ దర్శకుడు తెలుగు చిత్రం.. మహేష్, ప్రభాస్, దిల్ రాజుతో చర్చలు!
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కెజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. కన్నడ స్టార్ యష్ గురించి ఎంతలా చర్చించుకున్నారో, ఈ చిత్ర దర్శకుడి ప్రశాంత్ నీల్ గురించి కూడా అంతేలా చర్చించుకున్నారు. భవిషత్తులో ఇండియాలో టాప్ దర్శకులలో ఒకరిగా ప్రశాంత్ నీల్ ఎదుగుతారని ప్రశంసలు కెజిఎఫ్ చిత్రం ద్వారా దక్కాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు కెజిఎఫ్ చాప్టర్ 2ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రాల కోసం పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు క్యూలు కడుతున్నట్లు తెలుస్తోంది.

నమ్రతతో చర్చలు
ప్రశాంత్ నీల్ కు తెలుగులో భారీ అవకాశాలు వస్తున్నాయి. అతడు ఓకే అంటే ఎంత బడ్జెట్ అయినా వెచ్చించి చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ప్రశాంత్ నీల్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ తరుపున నమ్రత, ప్రశాంత్ నీల్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయట. వీరు ప్రాధమికంగా ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ ప్రయత్నాలు
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కూడా ప్రశాంత్ నీల్ ఓ చిత్రం చేసేలా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు అతడిని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కెజిఎఫ్ చిత్రాన్ని ప్రభాస్ స్వయంగా వీక్షించి చిత్ర యూనిట్ ని అభినందించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ కు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. ఇప్పటికే ప్రభాస్ తో సాహో లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

రేసులోకి దిల్ రాజు
ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ప్రశాంత్ నీల్ కోసం ఇటీవల రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఓ చిత్రం చేసేలా దిల్ రాజు ఇటీవల దర్శకుడితో సంప్రదింపులు జరిపారట. మరి కెజిఎఫ్ చాప్టర్ 2 పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఏ చిత్రాన్ని ఎంచుకుంటారో చూడాలి. కెజిఎఫ్ లో ఈ దర్శకుడి టేకింగ్ చూసిన తర్వాత ఆడియన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.

రెండు కథలు
ఇక ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాల కోసం రెండు భారీ కథలు సిద్ధం చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కథలని దిల్ రాజు విన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కెజిఎఫ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ హీరో యష్ ని చూపించిన విధానానికి ఫిదా అయ్యారు.


Click it and Unblock the Notifications











