Kingdom: మరోసారి కింగ్‌డమ్ వాయిదా? ట్వీట్‌తో షాకిచ్చిన నిర్మాత నాగవంశీ
వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతోన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కింగ్‌డమ్‌లో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.
లిప్‌లాక్‌తో విజయ్ - భాగ్యశ్రీ హల్‌చల్
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసిన కింగ్‌డమ్‌కు సంబంధించిన మొన్నామధ్య ఓ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇందులో విజయ్- భాగ్యశ్రీల మధ్య లిప్‌లాక్ సీన్ హాట్ టాపిక్‌గా మారింది. తొలుత ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే అనివార్య కారణాలతో జూలై 4న రిలీజ్ చేస్తామని ప్రకటించింది. నాడు పహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ - పాకిస్తాన్ యుద్ధంతో దేశం మొత్తం ఉద్విగ్నంగా ఉంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రచారాలు, సెలబ్రేషన్స్ వంటివి కరెక్ట్ కాదని.. సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

మూడుసార్లు వాయిదాపడ్డ కింగ్‌డమ్
అయితే ఆ తర్వాత కూడా కింగ్‌డమ్ వాయిదా పడుతుందని ఊహాగానాలు వచ్చాయి. జూలై 4న నితిన్ నటించిన తమ్ముడు రిలీజ్ ఉండటంతో మరోసారి కింగ్‌డమ్ వెనక్కి వెళ్లింది. ఈసారి ఏకంగా జూలై 25కి వాయిదా వేసింది చిత్ర యూనిట్. సినిమా విడుదల ప్రతీసారి వాయిదా పడటానికి పలు కారణాలు తెర మీదకి వచ్చాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వల్లే కింగ్‌డమ్ వాయిదా పడుతుందని టాలీవుడ్ టాక్. మ్యూజిక్, రీ రికార్డింగ్ తదితర పనులు పెండింగ్‌లో ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని అంటున్నారు.
కింగ్‌గమ్‌కు పోటీగా వీరమల్లు
జూలై 25న ఖచ్చితంగా కింగ్‌డమ్ విడుదల ఉంటుందని భావిస్తున్న వేళ.. దానికి ముందు రోజు (జూలై 24)న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరి వీరమల్లు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దీంతో పవన్- విజయ్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు బాక్సాఫీస్ వద్ద అసలు సిసలు వార్ నడుస్తుందని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ దశలో కింగ్‌డమ్ ఈసారి కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయంటూ చిత్రసీమలో పుకార్లు వైరల్ అవుతున్నాయి.
నాగవంశీ ట్వీట్‌తో కొత్త అనుమానాలు
ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్ కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. 'ఏం పోస్ట్ చేసినా, కింగ్‌డమ్ మీద స్వీట్ శాపాలు వస్తాయని తెలుసు. కానీ నన్ను నమ్మండి, నా టీమ్ మీకు తెరపై మంచి అనుభవాన్ని అందించడానికి 24 గంటలూ శ్రమిస్తోంది. నేను మీకు ఓ విషయంపై క్లారిటీ ఇవ్వగలను.. కింగ్‌డమ్ అందించే అనుభూతి, ఉత్సాహం మాత్రం మీ ఊహాకు కూడా అందదు. నేను ఏమైనా చెప్పానంటూ అది ఏంతో విశ్వసిస్తే తప్ప చెప్పను. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా నా మీద మీ క్రియేటివిటీ అంతా ప్రయోగిస్తారు. సినిమా చూసొచ్చి చెబుతున్నా.. విన్నర్ కింగ్‌డమే. గౌతం స్టైల్‌లో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. త్వరలో అదిరిపోయేలా రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం' అంటూ నాగవంశీ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యలో జూలై 25న కింగ్‌డమ్ రిలీజయ్యే అవకాశాలు లేవంటూ ఫిలింనగర్‌లో పుకార్లు వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే కింగ్‌గమ్ వాయిదా పడింది? కొత్త రిలీజ్ డేట్ ఏంటీ? అనేది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











