విశాల్ పెళ్లికి జోరందుకున్న ఏర్పాట్లు.. విశాల్‌కు కాబోయే భార్య ఆ హీరోయినే?
ఏళ్లుగా బ్యాచిలర్ లైఫ్ గడుపుతూ ఒంటరిగా జీవిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను ఒకరితో రిలేషన్‌లో ఉన్నానని త్వరలోనే ప్రేమ, పెళ్లి గురించి చెబుతానని ఇటీవల విశాల్ బాంబు పేల్చారు. దీంతో విశాల్ నిజంగానే రిలేషన్‌లో ఉన్నారా? విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? నిజంగానే ఈ ఏడాది విశాల్ పెళ్లి చేసుకుంటారా? అంటూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్ హీరోగా తెలుగువాడు
తెలుగువాడైన విశాల్.. కోలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. తనను ఎంతోమంది తొక్కేయాలని చూసినా నిలబడి గెలిచాడు. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీమీనన్, అనీషా రెడ్డి, రీమాసేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమలో పడ్డారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని, వృత్తిరీత్యా అనుబంధం తప్పించి తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వీరు పలుమార్లు గాసిప్స్‌ను ఖండించారు.

పెళ్లిపై హిట్ ఇచ్చిన విశాల్
అయితే నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ సినీ పెద్దల సమక్షంలో మంగమ్మ శపథం చేశారు. అనుకున్నట్లుగానే ఈ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 నాటికి నడిగర్ సంఘం నూతన భవనంలో పాలు పొంగించాలని విశాల్ దూకుడుగా ముందుకు వెళ్తూ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో తాను ఒకరితో రిలేషన్‌లో ఉన్నానని, ప్రేమ, ప్రియురాలు ఎవరన్న సంగతిని ఆగస్ట్ 29 నాడు అనౌన్స్ చేస్తానని వెల్లడించారు. దీంతో విశాల్ ఎవరితో ప్రేమలో పడ్డారనే దానిపై ఆరా తీసే పనిలో తమిళ మీడియా బిజీగా ఉంది.
సాయి ధన్సికతో విశాల్ ప్రేమాయణం
ఈ నేపథ్యంలో విశాల్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు సాయి ధన్సిక. తంజావూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ 2009లో పేరణ్మాయితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అరవణ్, పరదేశి తదితర చిత్రాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీలో ఆయనకు కూతురిగా నటించి పాపులర్ అయ్యారు సాయి. తెలుగులోనూ షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళం, కన్నడ సినిమాల్లోనూ సాయి ధన్సిక ఆడిపాడారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆమె కొత్తగా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
నడిగర సంఘం భవనమే అడ్డంకి
గత కొంతకాలంగా సాయి ధన్సికతో విశాల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో త్వరలో పెళ్లి చేసుకోవాలని విశాల్ - సాయి ధన్సికలు నిర్ణయించారట. అయితే నడిగర సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనన్న మాటకి కట్టుబడిన విశాల్.. ఈ భవనం ప్రారంభోత్సవం తర్వాత అధికారికంగా సాయిధన్సికతో పెళ్లిపై ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో కానీ.. విశాల్ అభిమానులు మాత్రం సంబరపడిపోతున్నారు.


Click it and Unblock the Notifications











