ఆచార్య ఎఫెక్ట్.. ఎన్టీఆర్ సినిమా విషయంలో యూటర్న్.. కొరటాల కొత్త రూట్ మ్యాప్
ఇటీవలే RRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ అందుకున్న ఈ నందమూరి వారసుడు.. అదే జోష్‌లో తన తదుపరి సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా కన్ఫర్మ్ చేశారు ఎన్టీఆర్. ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడో ఇచ్చారు కానీ ఇప్పటిదాకా షూటింగ్ అయితే షురూ కాలేదు. దీంతో ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై కొరటాల శివ తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఏంటది? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు? అనే దానిపై ఓ లుక్కేద్దామా..

ఆచార్య ఎఫెక్ట్.. కొరటాల డెసీషన్
కొరటాల శివ రూపొందించిన ఆచార్య సినిమా ఎఫెక్ట్ వల్లనే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం చేస్తూ వస్తున్నారనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపించింది. లేదు లేదు ఈ ప్రాజెక్టు ఆపేశారని కూడా కొందరున్నారు. ఈ పరిస్థితుల నడుమ రీసెంట్ గా ఈ ప్రాజెక్టుపై నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ చెప్పారు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్.

NTR30.. అందుకే నో అప్‌డేట్స్
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా దాటి గ్లోబల్‌కు చేరిందని.. అందుకే ఆ అంచనాలను రీచ్ అయ్యేలా ఎన్టీఆర్ తదుపరి సినిమా పనులు నడుస్తున్నాయని కళ్యాణ్ రామ్ అన్నారు. అందుకే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేంత ఫాస్ట్‌గా అప్‌డేట్స్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది.

కొరటాల రూట్ మ్యాప్ చేంజ్.. ఫ్యాన్స్ ఇక తప్పదు మరి
ఈ కోణంలోనే ఎన్టీఆర్ రేంజ్‌కి తగ్గట్లుగా తన దగ్గర ఉన్న కథకు ఓ కొత్త పాయింట్ జోడించి పాన్ ఇండియా లెవెల్ స్టోరీ రెడీ చేస్తున్నారట కొరటాల శివ. ఈ కథ అంతా సిద్ధం కాగానే సెట్ మీదకు వెళ్తారని.. ఈ మేరకు రూట్ మ్యాప్ మార్చేశారని తెలుస్తోంది. అప్పటిదాకా ఇంకాస్త ఆలస్యమైనా నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదని అంటున్నారు.

షూటింగ్ ప్రారంభించేది అప్పుడే..
కొరటాల కొత్తగా అల్లుతున్న కథలో పలు కమర్షియల్ అంశాలు కూడా జోడిస్తున్నారని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఈ కథకు పదును పెడుతున్నారని ఫిలిం నగర్ టాక్. దీంతో ఈ కథ రెడీ అయి సెట్స్ మీదకు రావడానికి నవంబర్ నెల రావొచ్చని చెబుతున్నారు. అంటే NTR30 రెగ్యులర్ షూటింగ్ కోసం మరో 2 నుంచి 3 నెలల ఎదురుచూపు తప్పనిసరి అని చెప్పుకోవచ్చు.

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు?
ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తీసుకోబోయే హీరోయిన్ విషయమై పలు పేర్లు ఇప్పటికే ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ లిస్టులో ఆలియా భట్, శ్రద్దా కపూర్, సాయి పల్లవి, కియారా అద్వానీ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా హీరోయిన్ విషయమై ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. ఎన్టీఆర్- కొరటాల శివ సక్సెస్‌ఫుల్ కాంబో కావడంతో ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











