గాలి జనార్ధన రెడ్డి కథతో..ఆ భారీ చిత్రం??
దగ్గుబాటి రానా హీరోగా, క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ చిత్రం కథ అక్రమ మైనింగ్ తవ్వకాలు, మైనింగ్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. బళ్లారి బేస్ గా కథనం నడుస్తుందని చెప్తున్నారు. గాలి జనార్ధన రెడ్డి పాత్రను బేస్ చేసుకుని ఆ పాత్రను రూపొందించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో రానా బిటెక్ బాబు గా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు. మైనింగ్ మాపియా మీద యుద్దం ప్రకటించే కుర్రాడిగా రానా కనిపిస్తాడని, అతను ఈ చిత్రంలో నాటకాలు వేస్తాడని అంటున్నారు.
క్రిష్ మీడియాతో రానా పాత్ర గురించి మాట్లాడుతూ...అతని పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.
అలాగే ...ఒక మంచి స్క్రిప్ట్ నమ్మి గమ్యం చేశాను. మళ్ళీ అదే టీమ్‌తో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా వుంది. ఖైదీ సినిమా చిరంజీవి గారికి ఎలా అయితే టర్నింగ్ పాయింట్ అయిందో, ఈ సినిమా రానాకు, నాకూ అలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా కథ ఐడియా జస్ట్ రెండు నిమిషాల్లో వచ్చింది. వెంటనే రానాకు ఫోన్ చేసి చెప్పాను. అతను మాత్రమే ఈ కథకు సూట్ అవుతాడు. గమ్యం, వేదంలలో గాలి శీను, కేబుల్ రాజును చూపించిన విధంగానే ఇందులో రానాని బీటెక్ బాబుగా చూపిస్తున్నాను. ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని అన్నారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.
హీరో రానా మాట్లాడుతూ...ఇది నాకు ఆరో సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నా కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పాత్రను చేస్తుండటం చాలా ఆనందంగా వుందని అన్నారు. 'గమ్యం', 'వేదం'.. ఇవి రెండూ జీవితాల్లోంచి పుట్టిన కథలు. ఇది కూడా అలాంటిదే. అయినా వాణిజ్య అంశాలకు కొదవ ఉండదు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











