సినిమా రికార్డులేమోకాని జూ ఎన్టీఆర్ కి పెళ్ళి రికార్డ్ గ్యారెంటీ....!
పెళ్లికళ ఉట్టిపడుతున్న యన్టీఆర్ గత వారం, పది రోజుల నుంచీ ప్రముఖులకు స్వయంగా శుభలేఖలు పంచుతూ, పెళ్లికి ఆహ్వానించే పనిలో బిజీగా కనిపిస్తున్నాడు. రోజల్లా ఇదే పని మీద ఉంటున్నప్పటికీ శుభలేఖలు పంచడానికి చాలా సమయం పడుతోందట. ఎక్కడికెళ్ళినా ఎవరూ త్వరగా వదలడం లేదు. రాక రాక వచ్చిన అతిథిగా చూస్తూ, ఏ ఇంటి కెళ్ళినా ఇంట్లో వాళ్లంతా వచ్చి కబుర్లు చెబుతున్నారట. కాఫీ తాగమనీ, భోజనం చేసి వెళ్ళమనీ ఎవరికి వాళ్ళు బలవంతం పెడుతుండడంతో మన పెళ్ళికొడుకు చాలా ఇబ్బందిపడిపోతున్నాడు. ఫ్యామిలీ ఆల్బంలా రూపొందించిన ఈ శుభలేఖ ఒక్కొక్కటి మూడువేలు పడిందట.
మరోపక్క, పెళ్లి ఏర్పాట్లు మాదాపూర్ లోని హైటెక్స్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగిపోతున్నాయి. వివాహ వేదికను కోట్లాది రూపాయల వ్యయంతో సినిమా సెట్ మాదిరి రూపొందిస్తున్నారు. పెళ్లి నాడు సంప్రదాయ బద్ధంగా పట్టు పంచె, లాల్చీ ధరించాలన్నది యన్టీఆర్ కోరిక. ఇక పెళ్ళికూతురు లక్ష్మీ ప్రణతి ధరించే పెళ్లి చీరలను కాంచీపురం వెళ్లి కొనుగోలు చేశారు. పెళ్లిపీటలపై ధరించడానికి పూర్తి బంగారంతో తయారుచేసిన పట్టు చీరను 50 లక్షలు వెచ్చించి కొన్నారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అలాగే, మరో రెండు చీరలను ఒక్కొక్కటి 30 లక్షలు పెట్టి తీసుకున్నారట. పెళ్ళికూతురు ధరించే ఆభరణాలకు నాలుగు కోట్లు వెచ్చించారని చెబుతున్నారు. వివాహానంతరం యన్టీఆర్ దంపతులు హనీమూన్ కి బాలి దీవులకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఏమైనా, మే 5 న జరిగే యన్టీఆర్ వివాహం 'ఖరీదైన" వివాహాల్లో ఒకటిగా రికార్డులకెక్కనుంది!


Click it and Unblock the Notifications











