మహేష్, సుకుమార్ సినిమాకు ఈ టైటిలే ఖరారు?
దర్శకుడు సుకుమార్‌గానీ, నిర్మాతలుగానీ టైటిల్ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఈ నెల 31న సినిమా పేరుని వెల్లడిస్తారని సమాచారం. 'నేనొక్కడినే' అనే టైటిల్ పట్ల దర్శక, నిర్మాతలు ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.
ఈ చిత్రంలో మహేష్‌కి జోడీగా కొత్తమ్మాయి కృతిసనన్ నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
అక్కడ రాత్రి వేళల్లో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ రీసెంట్ హిట్ 'ఏక్‌థా టైగర్' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. జూన్ 4 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం.
ఈ షెడ్యూల్ అనంతరం జూన్ 13 నుంచి యూకేలో 45 రోజుల భారీ షెడ్యూల్‌ని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మహేష్ సినిమాకు ఆయన తొలిసారి పనిచేస్తుండటం విశేషం.
ఇప్పటివరకూ సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిని మించేలా అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ అందించినట్లు సమాచారం. మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి.


Click it and Unblock the Notifications












