వరుడు..ఎన్ కౌంటర్..ఖల్లాస్.. కిలాడీ!
ఏడాదికి రెండు సినిమాల్లో నటిస్తానంటూ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టకోలేకపోయినందుకు చింతిస్తున్నట్టు మహేష్ ఇటీవల థమ్సప్ ప్రమోషన్ కార్యక్రమంలో వివరణ ఇచ్చారు. 'అతిథి' చిత్రం తర్వాత దాదాపు రెండేళ్లుగా ప్రిన్స్ మహేష్ నటించిన కొత్త చిత్రం ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా తన నుంచి కనీసం రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ రాజస్థాన్, పొల్లాచ్చిలో కీలకమైన షెడ్యూల్స్ ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 10 నుంచి రాజస్థాన్ లో నెలరోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ జరుగనుంది. మహేష్, కథానాయిక అనుష్కతో పాటు కీలక పాత్రను పోషించే నటులు పాల్గొంటారు.
రాజస్థాన్ షెడ్యూల్ లో కొన్ని పాటలు, ఫైట్స్, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ చిత్రంలో మహేష్ టాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నారనీ, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ అంటున్నారు. ఈ చిత్రానికి 'వరుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ వేరే టైటిల్ నిశ్చయించే అవకాశం ఉంది. 'కిలాడీ, 'ఖల్లాస్' అనే టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం 2010 సంక్రాంతికి విడుదలవుతుందని సినిమా వర్గాలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











