మహేష్, కొరటాల శివ ప్రాజెక్టుపై ఇదీ నిజం
హైదరాబాద్ : మహేష్ బాబు,కొరటాల శివ కాంబినేషన్ లో ఓ చిత్రం ఉందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే మహేష్ వరసగా ప్రాజెక్టులు ఒప్పుకోవటంతో ఈ చిత్రం లేనట్లే అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అందిన సమాచారం ప్రకారం మే రెండవ వారం నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
మరో ప్రక్క 'ఆగడు' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్‌బాబు. అయితే మే నాటికి చిత్రంలో మేజర్ పోర్షన్స్ షూటింగ్ ఫినిష్ అవనున్నాయి. మే లో కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆగడుకు కేటాయిస్తాడని,మిగతా డేట్స్ కొరటాల శివ వే అని తెలుస్తోంది. యూటీవీ మోషన్ పిక్చర్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'మిర్చి'తో ఆకట్టుకొన్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
మహేష్‌బాబు మాట్లాడుతూ ''యూటీవీ సంస్థతో ఓ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇందిర ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో యు.టి.వి. తెలుగులో నిర్మిస్తున్న తొలిచిత్రంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా వుంది. యు.టి.వి. సంస్థ తెలుగులో గొప్ప విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
యు.టి.వి. దక్షిణాది బిజినెస్-స్టూడియోస్ అధ్యక్షుడు ధనంజయన్ మాట్లాడుతూ 'భారతదేశంలో హిందీ తర్వాత రెండో పెద్ద చిత్ర పరిశ్రమ అయినా తెలుగులో మా ప్రస్థానాన్ని ప్రారంభిస్తుండటం ఆనందంగా వుంది. అత్యున్నత ప్రమాణాలతో తెలుగుప్రేక్షకులు గర్వించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాం. తెలుగులో మా సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రమిది. మహేష్‌బాబులాంటి హీరో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అన్ని వర్గాలను అలరించే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది''అన్నారు .
''నా మూడో చిత్రం మహేష్‌తో చేయడం సంతోషంగా ఉంద''ని దర్శకుడు చెప్పారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications












