Mega 158: మెగా ఆఫర్ పట్టేసిన మలయాళ బ్యూటీ.. చిరంజీవి కూతురు ఫిక్స్ !
Mega 158: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో చిరంజీవి మరోసారి ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జోష్‌తోనే ఇప్పుడు చిరంజీవి తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత మళ్లీ దర్శకుడు బాబీ కొల్లి తో కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాత్కాలికంగా 'మెగా 158'గా పిలుస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.
గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్ వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అదే కాంబోలో మరో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి కూడా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతుందని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి బాబీ ఇప్పటికే పవర్ పుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తండ్రీ-కూతురు మధ్య ఉండే భావోద్వేగాలు ఈ సినిమాలో కీలకంగా ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.

కీలక పాత్రలో మోహన్ లాల్?
ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, హీరోయిన్‌గా ప్రియమణి నటించే అవకాశం ఉందని కూడా టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. అందుకే ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశం గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది.
మొదట ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు వినిపించింది. తర్వాత బాలనటి నుంచి హీరోయిన్‌గా మారిన 'సారా అర్జున్' పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా మలయాళ నటి నస్వర రాజన్** ఈ పాత్రకు దాదాపు ఫైనల్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే.. భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో సహజ నటనలో మంచి పేరు తెచ్చుకున్న నటిని ఎంపిక చేయాలని దర్శకుడు బాబీ కొల్లి భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో అనస్వర రాజన్ సహజమైన నటన, భావవ్యక్తీకరణ ఈ పాత్రకు సరిపోతాయని భావించి ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అనస్వర రాజన్ సినీ ప్రయాణం
అనస్వర రాజన్ 2017లో విడుదలైన మలయాళ చిత్రం 'ఉధారణం సుజాత' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా పలు మలయాళ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా 'నేరు' అనే కోర్ట్‌రూమ్ డ్రామాలో చూపులేని యువతిగా చేసిన నటన ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చింది. తెలుగులో కూడా ఆమె అడుగుపెట్టింది. ఇటీవల రోషన్ మేక హీరోగా వచ్చిన 'ఛాంపియన్' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 'మెగా 158'లో అవకాశం వస్తే అది ఆమె కెరీర్‌కు పెద్ద మైలురాయిగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం?
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మార్చి చివర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశముందని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా కలగలిపిన ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అనస్వర రాజన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె పేరే ఫైనల్ దశలో ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











