బాలీవుడ్ పాన్ ఇండియా సినిమా కోసం రంగంలోకి చిరు.. నేరుగా రాజమౌళి కోరడంతో?
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

తొలిసారి జంటగా
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అందుకే ఈ సినిమాకు కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తొలిసారి జంటగా కనిపిస్తున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి సమర్పణ
ప్రీతమ్ సంగీతం అందిస్తున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో మౌని రాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అమితాబ్ బచ్చన్, నాగార్జున లుక్స్ రివీల్ చేసి చిత్రంపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.

చిరంజీవితో
ఇక మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ బ్రహ్మాస్త్ర కోసం రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి చిరంజీవి తన సపోర్ట్‌ను అందించనున్నారు. హిందీ వెర్షన్‌కి అమితాబ్ బచ్చన్ వాయిస్ అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇస్తున్నారని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇటీవల చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.

అధికారిక ప్రకటన
రాజమౌళి కూడా కోరడంతో ఈ సమావేశం విషయంలో మెగాస్టార్ సానుకూలంగా స్పందించారని, ఒకటి లేదా రెండు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చని వర్గాలు చెబుతున్నాయి. తెలుగు మార్కెట్‌ను సీరియస్‌గా తీసుకున్న తొలి బాలీవుడ్ సినిమా అని బ్రహ్మాస్త్ర గురించి చెప్పాలి. అందుకే ఆ సినిమా టీమ్ ఎస్ఎస్ రాజమౌళిని సౌత్ వెర్షన్స్ కోసం సమర్పకుడిగా ఎంచుకున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఒక బలం అనే చెప్పాలి.

సెప్టెంబర్ 9న విడుదల
ఇక ఈ సినిమా మరో ఘనత కూడా సాధించింది. అదేమంటే హైదరాబాద్ వెలుపల తన సినిమాను ప్రమోట్ చేసిన మొదటి బాలీవుడ్ సూపర్ స్టార్ గా రణబీర్ కపూర్ నిలిచారు. ఈ టీం ఇటీవలే విశాఖపట్నంలో ప్రచార యాత్రకు వచ్చింది. రానున్న రోజుల్లో తెలుగు వెర్షన్‌పై మరింత ఆసక్తికర ప్రచారం జరగనుందని వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్-అడ్వెంచర్‌ను కరణ్ జోహార్‌తో కలిసి డిస్నీ సంస్థ నిర్మించింది మరియు సెప్టెంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











