Sai Pallavi: వెండితెరపై లెజెండరీ సింగర్ బయోపిక్.. లీడ్ రోల్‌లో సాయి పల్లవి?
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథను 'మహానటి'గా తెరకెక్కించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత, నందమూరి తారక రామారావు, వైఎస్. రాజశేఖర్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, క్రీడాకారుల జీవితాల ఆధారంగా బయోపిక్ లకు తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా లెజెండరీ సింగర్ బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సింగర్ ఎవరు?
ఆ లెజండరీ సింగర్ ఎవరో కాదు.. భారతీయ శాస్త్రీయ సంగీతానికి చిరస్మరణీయమైన సేవలు అందించిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బయోపిక్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ (Geetha Arts) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

నిర్మాత బన్నీ వాస్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుండి నడిపిస్తున్నారని టాక్. 'జెర్సీ', 'మళ్లీ రావా' వంటి హృదయాన్ని తాకే చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన గౌతమ్ తిన్నానూరి (Gowtam Tinnanuri) దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయని, ప్రీ-ప్రొడక్షన్ దశ వేగంగా కొనసాగుతోందని తెలుస్తోంది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు పొందారు. 1916లో మధురైలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకుని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అగ్రస్థానానికి ఎదిగారు. భారతరత్న పురస్కారం అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలు కావడం ఆమె ప్రత్యేకత. రామన్ మెగసెసే అవార్డు వంటి అంతర్జాతీయ గౌరవాలు కూడా ఆమె ఖ్యాతిని మరింత పెంచాయి. ఆమె జీవితం కేవలం విజయాలే కాదు, ఎన్నో సవాళ్లు, త్యాగాలు, వ్యక్తిగత పోరాటాలతో నిండినదే అని చరిత్ర చెబుతోంది. ఈ కోణాలన్నింటినీ సమగ్రంగా చూపించేలా కథా రచన జరుగుతోందట.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పాత్రకు సాయి పల్లవిని పరిశీలించడం వెనుక కారణాలు కూడా ఆసక్తికరమే. సహజ నటన, మేకప్‌లెస్ లుక్, క్లాసికల్ గ్రేస్.. ఇవి అన్నీ సుబ్బులక్ష్మి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయని మూవీ టీమ్ భావిస్తోందట. అదనంగా, తమిళం-తెలుగు భాషలపై ఆమెకు ఉన్న పట్టు ఈ సినిమాని ద్విభాషా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించేందుకు అనుకూలంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక క్లాసికల్ ఆర్టిస్ట్ భావోద్వేగాలను తెరపై సహజంగా ప్రతిబింబించగల సామర్థ్యం సాయి పల్లవికి ఉందన్న నమ్మకం టీమ్‌లో ఉంది.
సంగీతం విషయంలో కూడా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వారసత్వానికి తగిన గౌరవంతో సంగీతాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో సాయి పల్లవి కెరీర్ అత్యంత కీలక దశలో ఉంది. బాలీవుడ్‌లో నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న 'రామాయణ'లో సీత పాత్రలో నటిస్తున్నారు. అదే సమయంలో దక్షిణాది సినిమాలపై కూడా మళ్లీ దృష్టి సారిస్తోంది. బయోగ్రాఫికల్, మైథాలజికల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌ల బ్యాలెన్స్ చేస్తూ.. ఆమె కెరీర్‌ను విస్తరిస్తోంది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ నిజమైతే... అది ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ వార్త ఇప్పటికే సినీప్రియుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఈ ప్రయత్నం నిజమైతే... అది భారతీయ కళాసంస్కృతికి గౌరవప్రద నివాళిగా నిలుస్తుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











