పవన్‌కు రెండే ఆప్షన్స్: రంగంలోకి మైత్రీ మూవీస్.. 2రోజుల్లో తేల్చేస్తారా?..
Recommended Video

పవన్ కల్యాణ్‌ను మళ్లీ వెండితెరపై చూస్తామా? లేదా? అన్న బెంగ చాలామంది ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. అజ్ఞాతవాసి మిగిల్చిన అసంతృప్తిని చల్లార్చేందుకైనా పవన్ మరో సినిమా చేస్తే బాగుండు అనేది సగటు అభిమాని ఆవేదన. మరి పవన్‌కు సినిమాలకు కేటాయించేంత టైమ్ ఉందా?.. అసలు చేయడానికి ఆసక్తి ఉందా?.. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రావచ్చేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి..

అభిమానుల్లో ఆశలు:
ఇటీవలి కొండగట్టు యాత్రలో సినిమాల ఆలోచన లేదంటూ పవన్ ప్రకటించారు. అయితే ఆలోచన లేదన్నారు తప్పితే.. పూర్తిగా మానేస్తున్నానని ఎక్కడా చెప్పలేదు. సీరియస్‌గా రాజకీయాలపై ఫోకస్ చేసినందునా ప్రస్తుతానికి మాత్రం టైమ్ లేదన్న తరహాలో ఆ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పవన్ మళ్లీ సినిమా చేస్తారేమోనన్న ఆశలు అభిమానుల్లో చిగురిస్తున్నాయి.

పవన్ మొగ్గు ఎటువైపు?
నిజానికి పవన్ పలు ప్రొడక్షన్ హౌజ్ లకు సినిమాలు బాకీ ఉన్నారు. ఆయా నిర్మాతల నుంచి ఆయన అడ్వాన్సులు కూడా పుచ్చేసుకున్నారు. కాబట్టి ఒప్పందం మేరకు వాళ్లతో సినిమాలు చేయడమా?.. లేక అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయడమా? అన్నది జరగాలి. ఈ రెండింటిలో పవన్ దేనివైపు మొగ్గుతారంటే.. మొదటి దానికే మొగ్గవచ్చునేమో అన్న సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

సన్నిహితుల సలహా ఇదీ?..::
నిర్మాతలకు అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయడమంటే మాటలు కాదు. అన్నీ కలిపి సుమారు రూ.20కోట్లకు పైనే ఉండవచ్చున్న ప్రచారం జరుగుతోంది. ఒక్క మైత్రీ మూవీస్ నుంచే రూ.12కోట్ల దాకా పవన్ అడ్వాన్స్ రూపంలో తీసుకున్నారని తెలుస్తోంది.
అంత భారీ మొత్తం పవన్ ఇప్పటికిప్పుడు చెల్లించాలంటే.. ఆస్తులు అమ్మితే తప్ప పనికాదు. కాబట్టి మళ్లీ సినిమా చేసి.. ఆ డబ్బుతో మిగతావాళ్ల అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమని సన్నిహితులు సలహా ఇస్తున్నారట.

రంగంలోకి మైత్రీ మూవీస్..
పవన్ తో సినిమా కోసం ఒప్పందం చేసుకుని.. అడ్వాన్సు కూడా ఇచ్చేసినవాళ్లలో మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పవన్‌తో విషయాన్ని ఫైనల్ చేసేందుకు మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ మరో రెండు రోజుల్లో అమెరికా నుంచి రాబోతున్నారట.

రెండే ఆప్షన్స్..?:
ఇప్పటికే పవన్ అపాయింట్‌మెంట్ కోరి మైత్రీ మూవీస్ నవీన్.. ఇండియా వచ్చాక నేరుగా పవన్ వద్దకు వెళ్లి సినిమా విషయం చర్చించనున్నారట. సినిమా చేయడానికి గనుక పవన్ ఒప్పుకుంటే..షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందామనే చర్చలోకి వెళ్తారట. లేదంటే.. అడ్వాన్సు తిరిగిచ్చే విషయమై పవన్‌తో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ రెండు ఆప్షన్స్‌లో పవన్ దేనివైపు మొగ్గుచూపుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్ మనసులో ఏముందో.. :
ఇటీవలే దర్శకుడు వినాయక్.. సినిమాల నుంచి తప్పుకోవద్దని పవన్ కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అటు అభిమానులు కూడా పవన్ మీటింగ్స్‌లో సినిమాల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. కాబట్టి పవన్ మనసు మార్చుకుని అభిమానుల కోసమైనా మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టవచ్చేమో! అంటున్నారు. మరి పవన్ మనసులో ఏముందో..


Click it and Unblock the Notifications