చిరంజీవికి స్టోరీ చెప్పిన పాన్ ఇండియా డైరెక్టర్.. కాంబో సెట్ అయితే మెగా ఫ్యాన్స్‌కు పండగే..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు'మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹350 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇలా పుల్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి పాన్ ఇండియా డైరెక్టర్ కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఇంతకీ ఆ కథేంటీ?
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రూపుదిద్దుకోబోతుందనే వార్త ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. కల్కి 2898 ADతో భారతీయ పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో మేళవించి, ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ ఆశ్విన్ (Nag Ashwin), ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోసం ఒక భారీ మైథాలజికల్ నేపథ్యం ఉన్న కథను సిద్ధం చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ కథ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను మెగాస్టార్‌కు వినిపించనున్నారని సమాచారం.

'కల్కి'తో నాగ్ అశ్విన్ తన విజన్‌ను గ్లోబల్ లెవల్‌లో చాటుకున్నారు. పురాణ గాథలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేసే ఆయన శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే తరహాలో ఇప్పుడు చిరంజీవి కోసం కూడా పౌరాణిక, ఫాంటసీ అంశాలతో కూడిన శక్తివంతమైన కథను సిద్ధం చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అయితే ఇది క్లాసిక్ హిట్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari)కి సీక్వెల్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) నిర్మించేందుకు సిద్ధమైందని టాక్. అశ్వినీదత్ ఆధ్వర్యంలోని ఈ బ్యానర్ ఇప్పటికే నాగ్ అశ్విన్‌తో 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి', 'కల్కి' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించింది. ఇక చిరంజీవితో ఈ సంస్థకు ఉన్న అనుబంధం ప్రత్యేకమే. జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు నాగ్ అశ్విన్ విజన్, వైజయంతీ మూవీస్ నిర్మాణ వైభవం, చిరంజీవి స్టార్ ఇమేజ్ అన్ని కలిస్తే అది కేవలం తెలుగు సినిమాకే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విజువల్ వండర్‌గా మారే అవకాశమున్నది టాక్.
ప్రస్తుతం చిరంజీవి తన సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర' పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ 'కల్కి' సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే.. అది తెలుగు సినీ చరిత్రలో మరో గోల్డెన్ చాప్టర్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ అశ్విన్ రాసుకున్న కథలో మెగాస్టార్ మ్యానరిజమ్స్, పౌరాణిక పాత్రల గాంభీర్యం సరిగ్గా మిళితమైతే..ఇది చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచిపోవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడితే, అది టాలీవుడ్‌లో ఈ ఏడాది అతిపెద్ద అనౌన్స్‌మెంట్‌గా మారడం ఖాయం.


Click it and Unblock the Notifications











