‘ఆటో నగర్ సూర్య’ రిలీజ్ ఎప్పుడు?
హైదరాబాద్: దడ, బెజవాడ ప్లాపు కావడంతో హిట్ కోసం పరితపిస్తున్న అక్కినేని యువ హీరో నాగచైతన్య మళ్లీ పరిశ్రమలో తన సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. నాగచైతన్య ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్' సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. హాట్ లేడీ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వినోదం, యాక్షన్ అంశాలతో మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెట్టబోతున్నాడు దర్శకుడు దేవా కట్ట. ఆటోనగర్ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే...విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎంత ఫేమసో... ఆటోనగర్ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం.
ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో చూపించబోతున్నారు.
'ఆటో నగర్ సూర్య' సినిమాలో రంభ ఐటం సాంగ్ ఉంటే బాగుంటుందని భావించారట. దర్శక,నిర్మాతలు పదే పదే కోరడంతో ఆమె ఈ ఐటం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ చిత్రంలో సాయికుమార్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











