చెర్రీ దార్లో..: తమన్నా, సమంతలతో చైతూ సయ్యాట?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, ప్రిన్స్ మహేష్ బాబు దారిలో నాగ చైతన్య నడుస్తున్నారు. మహేష్, చెర్రీలు తమ తండ్రులు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల పాటలను రిమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య మరో అడుగు ముందుకేయనున్నట్లుగా సమాచారం. తన తండ్రి నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా రీమేక్‌లో నాగ చైతన్య నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 1990లలో హలో బ్రదర్ సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో నాగ చైతన్య హీరోగా నటిస్తారని ఫిల్మ్ నగర్ భోగట్టా. హలో బ్రదర్ సినిమా పూర్తి కామెడీ చిత్రం. నాగార్జున ట్విన్స్‌గా నటించారు. అదే సినిమాను ప్రముఖ దర్శకులు శ్రీనివాస్ రెడ్డి రీమేక్ చేయాలని భావిస్తున్నారట. శ్రీనివాస్ రెడ్డి ఇటీవల నాగార్జునకు డమరుకం రూపంలో సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చాడు.
అదే ఊపులో ఉన్న దర్శకుడు హలో బ్రదర్ రీమేక్‌ను నాగ చైతన్యతో చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం హలో బ్రదర్ ఒరిజినల్ స్క్రిప్టును ఒంటబట్టించుకునే పనిలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారట. అదే సమయంలో హలో బ్రదర్ చిత్రంలో సూపర్ హిట్ అయిన రెండు పాటలను కూడా రిమిక్స్ చేయాలని భావిస్తున్నారట.
హలో బ్రదర్ చిత్రంలోని కన్నె పిల్లరో కన్ను కొట్టరో..., ప్రియరాగాలే... పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల నోళ్లలో నానుతుంటాయి. ఆ పాటలను రీమిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన తమన్నా, సమంతలను ఎంపిక చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
మరోవైపు... నాగ చైతన్య డబుల్ రోల్‌లో ఓ సినిమాను తీస్తున్నామని, అయితే అది తన తండ్రి నటించిన సినిమా రీమేక్ కాదని దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారట.


Click it and Unblock the Notifications











