కేసీఆర్ కూడా నాగార్జున ఫ్యాన్, ఇబ్బంది ఉండదని హామీ?
హైదరాబాద్: నాగార్జున నటించిన 'శివ' చిత్రానికి ఎంత మంది అభిమానులు ఉన్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రమది. ఈ చిత్రం తర్వాత నాగార్జున అభిమానుల సంఖ్య భారీగా పెరిగి పోయింది. తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రం చూసి అభిమానులైన వారిలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఉన్నారట.
ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్‌ను నాగార్జున కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నేను మీకు 'శివ' చిత్రం నుండే అభిమానిని అని చెప్పినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందనీ.. భవిష్యత్‌లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

అయితే నాగార్జున కేసీఆర్‌ను కలిసినట్లుగా అధికారిక సమాచారం ఇంకా అందలేదు. ఇది కేవలం ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మాత్రమే. అఫీషియల్ సమాచారం అందిన వెంటనే పాఠకులకు ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడిస్తాం.
నాగార్జున సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం ఆయన నటించిన 'మనం' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మనం చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందింది. తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించి చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.


Click it and Unblock the Notifications











