కొడుకుతో నాగార్జున మల్టీస్టారర్.. పవర్ఫుల్ స్టోరీ సెట్ చేసిన మెగాస్టార్ డైరెక్టర్
ఆరు పదుల వయసు వచ్చినా కూడా నిత్య యవ్వన మన్మథుడిలా కనిపించే ఏకైక హీరో అక్కినేని నాగార్జున. ఎలాంటి పాత్ర చేసినా కూడా తనదైన శైలిలో న్యాయం చేయగల ఈ స్టార్ హీరో డిజాస్టర్స్ ఎన్ని ఎదురైనా కూడా ఆ ప్రభావం తరువాత సినిమాలపై పడనివ్వకుండా చూసుకుంటాడు. ఇక త్వరలోనే నాగార్జున కొడుకుతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒక మెగా దర్శకుడు కూడా సెట్టయినట్లు తెలుస్తోంది.

మరో మల్టీస్టారర్ చేయాలని
అక్కినేని హీరోలలో ప్రస్తుతం నాగార్జున కంటే నాగచైతన్యనే ఎక్కువ స్పీడ్ పెంచుతున్నాడు. ఇక అఖిల్ మాత్రం మొదటి విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఒకవైపు బుల్లితెర జనాలను మరోవైపు వెండితెర అభిమానాన్ని అందుకుంటూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. మనం సినిమాలో కలిసి నటించిన ఈ హీరోలు మరో మల్టీస్టారర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

మనం 2పై రూమర్స్
ఆ మధ్య మనం 2 ఉంటుందని టాక్ బాగానే వచ్చింది. దర్శకుడు విక్రమ్ కుమార్ మనం సినిమాను డైరెక్ట్ చేసిన తరువాత అక్కినేని కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. అఖిల్ తో హలో సినిమా చేసిన విక్రమ్ ఇప్పుడు నాగచైతన్యతో థాంక్యు అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

అఖిల్ తో మల్టీస్టారర్
ఇక మనం సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో గాని ముందుగా నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. మనం సినిమాలో అఖిల్ చివరలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం తండ్రితో సమానంగా మరో హీరోగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు ఎవరంటే..
ఇక వీరిని డైరెక్ట్ చేయబోయే దర్శకుడు మరెవరో కాదు. ప్రస్తుతం మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ ను ప్లాన్ చేసుకుంటున్న మోహన్ రాజా. ఈ దర్శకుడు హీరోలిద్దరికి సరిపోయేలా మంచి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. కథలోని మెయిన్ పాయింట్ గురించి తెలుసుకున్న నాగార్జున దర్శకుడితో చర్చలు జరిపినట్లు సమాచారం. పూర్తిగా కథ సెట్టయిన తరువాత మరోసారి చర్చలు జరిపి ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











