Jailer 2కు బాలయ్య షాకింగ్ రెమ్యునరేషన్.. కెరీర్‌లోనే హయ్యెస్ట్!.. గెస్ట్ రోల్‌కే అన్ని కోట్లా?
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు బాలకృష్ణ.. దసరా లేదా దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య శ్రమిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి మించి ఆయన కోలీవుడ్ ఎంట్రీపై అందరి కళ్లూ పడ్డాయి.
టాలీవుడ్‌కే పరిమితమైన బాలకృష్ణ
50 ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో బాలకృష్ణ తెలుగు సినిమా తప్పించి మరో బాషా చిత్రం చేయలేదు. పలుమార్లు అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో బిజీగా ఉండటంతో వాటిని పక్కనపెట్టారు. తన తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లు బాలీవుడ్‌లో జెండా పాతగా బాలయ్య మాత్రం టాలీవుడ్‌కే పరిచయమయ్యారు. ఆయనను హిందీలో అరంగేట్రం చేయించాలని పలువురు ప్రయత్నించినా సెట్ కాలేదు. ఇక పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే అయినా, తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్నా, తెలుగుతో సమానంగా తమిళ భాషపై పట్టున్నా బాలకృష్ణ ఎందుకో కోలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

బాలయ్యను కాకాపట్టిన నెల్సన్
బాలయ్య యువకుడిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు పలువురు తమిళ దర్శక నిర్మాతలు ఆయనని సంప్రదించినా పలుమార్లు బాలకృష్ణ వాటిని తిరస్కరించారు. అలాంటి ఓ తమిళ దర్శకుడు మాత్రం బాలయ్యని ఒప్పించగలిగారు. ఆయనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్ వీరాభిమాని నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా 2023 ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన జైలర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ , సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్ణా మీనన్ , వినాయకన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
తొలిసారిగా రజనీతో కలిసి నటించనున్న బాలయ్య
జైలర్‌కు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు నెల్సన్. తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి జైలర్ 2 అనౌన్స్‌మెంట్‌తో తలైవా అభిమానుల్లో జోష్ తీసుకొచ్చారు. ఫస్ట్ పార్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు నెల్సన్. పార్ట్ 1లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరిశారు. తాజాగా పార్ట్ 2లోనూ ఇదే కంటిన్యూ చేయాలని నెల్సన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా బాలకృష్ణను సంప్రదించగా దీనికి బాలయ్య ఓకే చెప్పారట. జైలర్ 1 లోనే బాలయ్యను నటింపజేయాలని నెల్సన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. జైలర్ 2లో నటించేందుకు బాలయ్య అంగీకరించడంతో ఆయన కోసం ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను రూపొందించారట నెల్సన్.
హాట్ టాపిక్‌గా బాలయ్య రెమ్యునరేషన్
అయితే బాలయ్య గెస్ట్‌రోల్‌లో నటిస్తారా? కీ రోల్ పోషిస్తారా? ఆయన రెమ్యునరేషన్ ఎంత? అనే దానిపై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఫిలింనగర్‌లో వినిపిస్తున్న వార్తలను బట్టి జైలర్ 2 కోసం బాలయ్య 20 రోజుల డేట్స్ కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారట బాలయ్య. రోజుకు 2.5 కోట్ల రూపాయల చొప్పున 20 రోజులకు గాను దాదాపు రూ.50 కోట్ల పారితోషికం అందుకోనున్నారట. అదే నిజమైతే ఇది బాలయ్య కెరీర్‌లోనే అత్యధికం.. బాలయ్య తన సినిమాలకు ఏనాడూ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేయలేదు.. ఇప్పటికీ ఆయన పారితోషికం 20 నుంచి 30 కోట్ల మధ్యనే ఉంది. ఇప్పుడు జైలర్‌లో గెస్ట్ రోల్ కోసమే ఈ స్థాయిలో వసూలు చేస్తే మాత్రం అది రికార్డే.


Click it and Unblock the Notifications











