నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. బాలయ్య క్లాసిక్ మూవీ సీక్వెల్‌లో అబ్బాయ్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'పటాస్'తో ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఆ తర్వాత చేసిన చేసిన పలు చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ఇక, ఇటీవల వచ్చిన '118'తో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు కల్యాణ్ రామ్. ఇందులో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదే ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపేస్తున్నాడీ నందమూరి హీరో. ప్రస్తుతం అతడు 'ఎంత మంచివాడవురా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అతడి తదుపరి చిత్రంపై ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

తేడా చూపిస్తున్నాడు
కల్యాణ్ రామ్ చాలా రోజుల పాటు కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ‘పటాస్' తర్వాతి నుంచి ఆయనలో ఆలోచన ధోరణి మారినట్లు కనిపిస్తోంది. ఆ సినిమా తర్వాత కల్యాణ్ చేసిన ప్రాజెక్టులు చూస్తే ఇది అర్థం అవుతోంది. సినిమా సినిమాకు తేడా చూపించడంతో పాటు తన నటనలోనూ పరిణితిని కనబరుస్తున్నాడు. దీంతో విజయాలను కూడా అందుకుంటున్నాడు.

మంచి వాడు అనిపించుకుంటాడట
కల్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా'. శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న దీన్ని తెరకెక్కిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మాతలు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మరో ప్రయోగానికి రెడీ
కల్యాణ్ రామ్ తన గత చిత్రాల ఫలితాల ఆధారంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ‘ఎంత మంచివాడవురా' తర్వాత అతడు ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను వేణు మల్లిడి అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయిందని టాక్.

బాబాయ్ సినిమాకు సీక్వెల్
ఈ సినిమాలో టైమ్ మెషీన్‌ను చూపించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హీరో టైమ్ మెషీన్ ఎక్కి ఐదు వందల సంవత్సరాలు వెనుకకు, ఐదు వందల సంవత్సరాలు భవిష్యత్‌లోకి వెళ్తాడట. ఇది బయటకు వచ్చినప్పటి నుంచి కల్యాణ్ రామ్ చేయబోయే ఈ సినిమా బాలయ్య నటించిన క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369'కు సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అప్పట్లో బాలయ్యపై ప్రశంసలు
సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘ఆదిత్య 369'. ఇది ‘బాక్ టు ఫ్యూచర్' అనే హాలీవుడ్, హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. ఇందులో సైన్స్ ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్‌లను చూపించారు. దీంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య కృష్ణదేవరాయలుగా కూడా కనిపించారు. అప్పట్లోనే ప్రయోగాత్మక చిత్రం చేసిన బాలయ్యపై ప్రశంసల వర్షం కురిసింది.


Click it and Unblock the Notifications











