Nani31: సంచలన దర్శకుడితో నాని.. మరోసారి అలాంటి కథతోనే!
ఏమాత్రం సినీ నేపథ్యంలో లేకుండానే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. సహజ సిద్దమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుని.. నేచురల్ స్టార్ అన్న బిరుదుకు న్యాయం చేస్తూ దూసుకుపోతోన్నాడు నాని. ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో మెప్పిస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంటోన్నాడు.
దీంతో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే నాని ఇటీవలే 'దసరా' అంటూ వచ్చి పాన్ ఇండియా హిట్‌ను కూడా ఖాతాలో వేసుకుని దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

'దసరా' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత నాని తన 30వ సినిమాను కూడా ప్రకటించాడు. శౌర్యూవ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 21న విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఈ చిత్రం పట్టాలపై ఉండగానే నాని తన 31వ సినిమాను కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తాజాగా ఓ మలయాళ డైరెక్టర్‌తో అతడు కథా పరమైన చర్చలు జరిపినట్లు ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే నేచురల్ స్టార్ నాని.. త్వరలోనే 'దృశ్యం' సిరీస్ దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఓ ప్రాజెక్టును చేయబోతున్నట్లు తాజాగా తెలిసింది. ఇటీవలే వీళ్లిద్దరూ భేటీ అయ్యారట.

ఆ సమయంలో సదరు దర్శకుడు చెప్పిన పాయింట్ నానికి ఎంతగానో నచ్చిందని సమాచారం. దీంతో జీతూ పూర్తి స్క్రిప్టును రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఇక, వీళ్లిద్దరి కాంబోకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. జీతూ జోసెఫ్‌తో చేయబోయే సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థతో కలిసి నానినే స్వయంగా నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారట. అంతేకాదు, ఈ చిత్రం కోసం జీతూ ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే రెడీ చేస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











