అనగనగా ఒక రాజుతో స్టార్ రేసులోకి... నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు వంటి భారీ బడ్జెట్ చిత్రాల నడుమ సంక్రాంతికి విడుదలై ఆ సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అనగనగా ఒక రాజు మూవీ. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా జనవరి 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. హౌస్‌ఫుల్ బుకింగ్స్‌తో వారం తిరిగేసరికి అనగనగా ఒకరాజు చిత్రం 100 కోట్ల రూపాయల మార్క్ అందుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తద్వారా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన హీరోల క్లబ్‌లోకి దూసుకొచ్చాడు నవీన్ పొలిశెట్టి. దాంతో ఆయన తదుపరి సినిమాలు, ఇతర విషయాలు, రెమ్యునరేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు పరిశీలిస్తే..
ఆల్‌రౌండర్‌గా నవీన్ పొలిశెట్టి
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఇప్పుడు గుర్తింపు, గౌరవాన్ని సాధించారు నవీన్ పొలిశెట్టి. స్టాండప్ కమెడియన్‌గా, యాంకర్‌గా, సింగర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, డైరెక్టర్‌గా, హీరోగా ఆల్‌రౌండర్ అనిపించుకున్నారు. అయితే ఆయన ప్రయాణం అంత ఆషామాషీగా సాగలేదు. దీని వెనుక ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఉన్నాయి. పదో తరగతి చదువుతున్నప్పుడే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసుకున్నానని, చిన్నప్పటి నుంచి నటనే శ్వాసగా ముందుకు వెళ్లినట్లు నవీన్ తెలిపారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ముందు ఇంజనీరింగ్‌ని పూర్తి చేశారు.. అది కూడా టాప్ మార్క్స్‌తో.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌తో ఎంట్రీ
అప్పట్లో ఆడిషన్ సిస్టమ్ సరిగా ఉండేది కాదని.. ఏ ఆఫీస్‌కి వెళ్లాలి? ఎవరిని సంప్రదించాలి అనేది కూడా తెలిసేది కాదని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చిన్న వీడియో కోసం రోజుకు 18 గంటల పాటు కష్టపడి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. కృష్ణానగర్‌లో ఉంటూ ప్రతి ఆఫీస్‌కు చెప్పులు అరిగేలా తిరిగానని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో నవీన్ పొలిశెట్టి సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత డీ ఫర్ దోపిడీ, వన్ నేనొక్కిడినే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, చిచ్చోరే, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి జాతిరత్నాలతో నవీన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అన్ని డిపార్ట్‌మెంట్స్‌పై గ్రిప్
సంక్రాంతి కానుకగా మారి దర్శకత్వంలో తెరకెక్కిన అనగనగా ఒక రాజు చిత్రం కోసం నవీన్ పొలిశెట్టి ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి దర్శకత్వ శాఖలో, స్క్రిప్ట్ రైటింగ్‌లో కీలకపాత్ర పోషించారు నవీన్. అలాగే ఓ పాట పాడి తనలోని సింగర్‌ను పరిచయం చేశారు. సినిమా కోసం జరిగిన ప్రతి ప్రమోషనల్ కార్యక్రమానికి తనే హోస్ట్‌గా ఉంటూ అనగనగా ఒక రాజు సినిమాకు అన్నీ తానే అయి ముందుకు నడిపించారు నవీన్ పొలిశెట్టి. మొత్తంగా ఈ సినిమాకు వన్ మ్యాన్ ఆర్మీ అనిపించుకున్నారు.
100 కోట్ల క్లబ్‌లో నవీన్ పొలిశెట్టి
రిలీజైన నాటి నుంచి రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తోన్న అనగనగా ఒక రాజు చిత్రం.. వారం తిరక్కుండానే వరల్డ్ వైడ్‌గా 100 కోట్ల రూపాయల మార్క్ అందుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దాంతో నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో నవీన్ రేంజ్, మార్కెట్ కూడా మారింది. దీంతో ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం పారితోషికంగా 15 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాడట నవీన్.
నిర్మాతలకు నవీన్ కండీషన్స్?
అంతేకాదు.. తన దగ్గరికి వచ్చే స్క్రిప్ట్‌లు, చేయబోయే ప్రాజెక్ట్‌ల విషయంలో నవీన్ పొలిశెట్టి ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. దర్శక నిర్మాతలకు నవీన్ పొలిశెట్టి కండీషన్స్ కూడా పెడుతున్నారట. స్టోరీ, స్క్రిప్ట్, ఎడిటింగ్, ప్రమోషన్స్ ఇలా ప్రతీ విషయంలో తనదే తుది నిర్ణయంగా ఉండాలని చెప్పినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇతరుల జోక్యం ఉండరాదని కూడా కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తోనే ఎక్కువ లాభాలు తీసుకురావడం.. ప్రతి డిపార్ట్‌మెంట్ మీద అవగాహనతో సినిమాను నవీన్ సక్సెస్ ట్రాక్ ఎక్కించగలరని దర్శక నిర్మాతలకు కూడా అనగనగా ఒకరాజు తదితర సినిమాలతో గురి కుదిరింది. ఈ నేపథ్యంలో నవీన్ పొలిశెట్టి ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు.. ఏం కోరితే దానికి యస్ అనేందుకు మేకర్స్ రెడీగా ఉన్నట్లుగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి నవీన్ రెమ్యునరేషన్, ఇతర వార్తల్లో క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











