SVSCకి...‘నాయక్’ షాక్, ఆడియో పోస్ట్ పోన్డ్!
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(SVSC), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాయక్' సినిమాల మధ్య కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇది కావాలని చేస్తున్నారా..? లేక అనుకోకుండా జరుగుతున్నవా? అనేవి తేలాల్సి ఉంది.
అసలు విషయానికొస్తే..
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో తొలుత డిసెంబర్ 13న వెంకీ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మర్నాడే(డిసెంబర్ 14) 'నాయక్' ఆడియో విడుదల చేయాలని నిర్ణయించడంతో....ఆలోచనలో పడ్డ SVSC దర్శక నిర్మాతలు తమ చిత్రం ఆడియో తేదీని డిసెంబర్ 13 నుండి 15కు వాయిదా వేసారు. ముందు విడుదలైన ఆడియో కంటే వెనక విడుదలైన ఆడియో టాక్ జనాల్లో ఎక్కువ రోజులు ఉంటుందనే ఉద్దేశ్యంతోనే SVSC టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
'నాయక్' చిత్ర దర్శకనిర్మాతలు కూడా అదే విధంగా ఆలోచించడంతో SVSC టీంకి షాక్ తగిలినట్లయింది. SVSC ఆడియో 15కు వాయిదా పడటంతో 'నాయక్' ఆడియో విడుదలను కూడా వాయిదా వేసారని, డిసెంబర్ 16న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించింది 'నాయక్' చిత్ర యూనిట్ సభ్యులే అని టాక్. తమ చిత్రం ఆడియోను 14న విడుదల చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చి....SVSC చిత్ర యూనిట్ సభ్యులను బోల్తా కొట్టించారని, SVSC ఆడియో 15న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ ప్రకటన రావడంతో......తమ చిత్రం ఆడియోను 16న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
అయితే...ఈ జిమ్మిక్కులన్నీ ఈ చిత్రం ఆడియో విజయానికి కొంత మేరకే పనిచేస్తాయనేది వాస్తవం. సినిమా పాటలు బాగుంటే ఎప్పుడు విడుదల చేసినా సూపర్ హిట్టవుతాయి. బాగోలేకుంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకులు వాటిని తిరస్కరిస్తారు. మరి విజయవం ఎవరిని వరిస్తుందో కొన్ని రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











