చిరంజీవి సినిమా నుంచి ఆ హీరోయిన్ ఔట్: తెరపైకి మరో హాట్ బ్యూటీ పేరు
'ఖైదీ నెంబర్ 150'తో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీనియర్ హీరో.. ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశారాయన. వీటిలో మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' రీమేక్ కూడా ఒకటి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం గురించి ఓ న్యూస్ లీకైంది.
మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'లూసీఫర్'ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హన్‌మాన్ జంక్షన్ ఫేం మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ రోల్‌ను క్రియేట్ చేసిన దర్శకుడు.. దాని కోసం నయనతారతో సంప్రదింపులు జరిపాడని, దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జోరుగా ప్రచారం జరిగింది. ఇక, రేపో మాపో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అనుకుంటోన్న సమయంలో.. లేడీ సూపర్ స్టార్ ఈ మూవీ నుంచి తప్పుకుందని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చేసే విషయంలో నయనతార యూటర్న్ తీసుకుందట. దీంతో దర్శకుడు మోహన్ రాజా.. సీనియర్ హీరోయిన్ త్రిషతో చర్చలు జరపగా.. ఆమె వెంటనే పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 'ఆచార్య'లోనే ఈ ముదురు భామ నటించాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో దీని నుంచి తప్పుకుంది. ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాలో ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పుకుందని టాక్. ఇక, ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











