NBK111 కోసం బాలకృష్ణ రికార్డు రెమ్యూనరేషన్! ఎన్ని కోట్లంటే?
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పేరు వినగానే థియేటర్లలో పూనకాలు మొదలవుతాయి. అరవై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. వరుస విజయాలతో కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను దుమ్మురేపుతున్న బాలకృష్ణ.. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని తో కలిసి తన 111వ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరా సింహా రెడ్డి (Veera Simha Reddy) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు 'NBK111'పై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హీరో బాలకృష్ణ రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం ఎన్ని కోట్లు తీసుకుంటున్నారంటే?
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు రూ.10 నుంచి రూ.12 కోట్ల రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకున్న బాలయ్య, గత కొన్నేళ్లలో తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో నిర్మాతలకు ఆయన సినిమాలపై నమ్మకం మరింత పెరిగింది. అందుకే 'NBK111' కోసం రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల మధ్య పారితోషికం ఫిక్స్ చేసినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఇదే నిజమైతే బాలయ్య కెరీర్‌లో ఇది రికార్డు రెమ్యూనరేషన్‌గా నిలుస్తుంది.

అయితే.. అఖండ 2 సినిమా కోసం మొదటగా రూ.45 కోట్ల వరకు తీసుకున్న సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా అనంతరం రూ.7 కోట్లు తగ్గించి ఒప్పందం కుదిరినట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. బాలయ్య మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్. ముఖ్యంగా బి, సి సెంటర్లలో బాలయ్య సినిమా విడుదల అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్, ఫ్యాన్స్ హంగామా, థియేటర్లలో వచ్చే స్పందన నిర్మాతలకు భారీ ధైర్యం ఇస్తోంది. మరోవైపు శాటిలైట్, డిజిటల్, ఓటీటీ హక్కుల రూపంలో కూడా మంచి బిజినెస్ జరుగుతుండటంతో భారీ పారితోషికం ఇవ్వడంలో నిర్మాతలు వెనుకాడటం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట బాలయ్య సరసన నయనతారను తీసుకోవాలని మేకర్స్ భావించినట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య-నయనతార కాంబినేషన్ గతంలో సింహా, శ్రీ రామ రాజ్యం, జై సింహా వంటి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జంట మంచి గుర్తింపు సంపాదించింది. అందుకే ఈ జోడీ మళ్లీ వస్తే సినిమాకు భారీ క్రేజ్ వస్తుందని భావించారు. అయితే కాల్షీట్ల సమస్యలు, పారితోషికం, ప్రమోషన్లకు అందుబాటులో ఉండకపోవడం వంటి కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు కాజల్ అగర్వాల్ పేరు ఫైనల్ అయినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాజల్ ఇప్పటికే సీనియర్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా మేకర్స్ ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. బాలయ్య-కాజల్ కాంబినేషన్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే, స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ యాక్షన్ కథను సిద్ధం చేశారని సమాచారం. ఇందులో రాజకీయ బ్యాక్‌డ్రాప్, కుటుంబ భావోద్వేగాలు, మాస్ ఎలివేషన్స్ అన్నీ మిక్స్ చేసి పూర్తి కమర్షియల్ ప్యాకేజ్‌గా రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిందని, అందులో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకు సంగీతం ఎస్. థమన్ అందిస్తున్నారు. బాలయ్య సినిమాల్లో థమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల్లో థమన్ మ్యూజిక్ థియేటర్లను షేక్ చేసింది. ఇప్పుడు 'NBK111' కోసం కూడా మరోసారి పవర్‌ఫుల్ ఆల్బమ్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య రికార్డు రెమ్యూనరేషన్, గోపీచంద్ మలినేని హిట్ కాంబో, థమన్ మ్యూజిక్ అన్ని కలిపి 'NBK111' ఇప్పటి నుంచే సంచలనంగా మారింది. అధికారిక ప్రకటనలు వెలువడితే ఈ సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications