పెళ్ళికూతురుగా నిహారిక కొణిదెల.. రెండో పెళ్లి అంటూ..
చిత్ర పరిశ్రమలో భార్య/ భర్త చనిపోవడం, వారి నుంచి విడాకులు తీసుకోవడం వంటి కారణాలతో ఒంటరిగా జీవిస్తోన్న వారు ఎందరో. వీరిలో కొందరు మరొకరిని పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ సంతోషంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక సతమతం అవుతున్నారు. ఈ కోవలోకే వస్తారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడంతో ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా జీవిస్తున్నారు. అయితే ఆమె రెండో పెళ్లిపై ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
నటిగా కలిసిరాని లక్
చిరంజీవి రెండో సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక. మెగా కుటుంబంలో దాదాపు డజను మంది హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతుండగా.. ఈ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నిహారిక. అంతకుముందే బుల్లితెరపై తన అదృష్టం పరీక్షించుకున్నారు. నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసులో సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టారు నిహారిక. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి తదితర చిత్రాల్లో నటించింది. కానీ నటిగా ఆమెకు అంతగా కలిసిరాలేదు.

చైతన్యతో విడాకులు
ప్రముఖ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి జరిపించారు పెద్దలు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగగా ఆ తర్వాత మనస్పర్ధలతో కొద్దినెలలకే ఈ జంట విడాకులు తీసుకుంది. నిహారిక విడాకుల అంశం మెగా కుటుంబానికి, అభిమానులకు షాకిచ్చింది. ఈ పరిణామాలతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమైన నిహారిక తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకున్నారు. అయితే నటిగా కాకుండా నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు.
నిర్మాతగా హిట్
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించారు. గతేడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించి తొలి ప్రయత్నంలోనే భారీ లాభాలను అందుకున్నారు నిహారిక కొణిదెల. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్ధర్ అవార్డ్స్‌లో కమిటీ కుర్రోళ్లకు అవార్డ్ దక్కడంతో నిహారిక హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిహారిక అవార్డును అందుకున్నారు.
నిహారిక రెండో పెళ్లిపై వార్తలు
ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను నిహారిక నిర్మిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. తన కెరీర్, జీవితం బాగుండాలనే ఉద్దేశంతో ఇటీవల తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నిహారిక. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ నిహారిక రెండో పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ పుకార్ల తాకిడి ఎక్కువైంది.
నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు క్లారిటీ
నిహారిక రెండో పెళ్లిపై ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు. పిల్లల కెరీర్ విషయంలో తాను జోక్యం చేసుకోనని తేల్చిచెప్పారు. చైతన్యతో నిహారిక పెళ్లి విషయంలో తన నిర్ణయం తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి బతకాలని అనుకోలేదు.. వారి నిర్ణయాన్ని అంగీకరించానని నాగబాబు పేర్కొన్నారు. నిహారిక తన జీవితంలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటుందని నాగబాబు సంకేతాలు ఇచ్చారు.
పెళ్లికూతురిలా నిహారిక
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిహారిక కొణిదెల తన సినిమాలు, షోలు, ఇతర వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆమె సాంప్రదాయబద్ధంగా చీరలో పెళ్లికూతురిలా రెడీ అయి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో నిహారిక రెండో పెళ్లిపై పుకార్లు ఊపందుకున్నాయి. త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ రూపంలో తమ స్పందనను తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











