‘మాస్ట్రో’ రిలీజ్ విషయంలో నితిన్ యూటర్న్: ఆ డీల్‌కు బ్రేక్.. విడుదల ఎందులో అంటే!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం 'మాస్ట్రో'. బాలీవుడ్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'అంధాధున్'కు ఇది రీమేక్‌గా వస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించేశారు. అవి కూడా దాదాపుగా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ గురించి ప్రకటన కూడా రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
నితిన్.. మేర్లపాక గాంధీ కాంబినేషనల్‌లో వస్తున్న 'మాస్ట్రో'ను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఏకంగా రూ. 30 కోట్లకు కొనుగోలు చేసినట్లు కూడా టాక్ వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. 'మాస్ట్రో' ఓటీటీ డీల్‌ను హీరో నితిన్ క్యాన్సిల్ చేసుకున్నాడట. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను తెరవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్న కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలపబోతున్నట్లు తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మాస్ట్రో' సాంగ్స్ వచ్చే వారం నుంచి ఒక్కొక్కటిగా విడుదల కాబోతున్నాయి. ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నితిన్ అంధుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీని నుంచి విడుదలైన అన్నింటికి మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











