ఎన్టీఆర్ కథానాయకుడు ఎఫెక్ట్.. మహానాయకుడులో మార్పులు.. విడుదల ఎప్పుడంటే!
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈచిత్ర వసూళ్లు ఏ దశలోనూ ఆశాజనకంగా లేవు. చిత్రానికి మంచి టాక్ వచ్చినా, బాలయ్య నటన అదుర్స్ అనిపించినా ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. అన్ని ఏరియాలలో ఈ చిత్ర బయ్యర్లు తీవ్రమైన నష్టాలని ఎదుర్కొన్నారు. దీనితో బాలయ్య ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర విషయంలో సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆసక్తికరమైన భాగం
ఎన్టీఆర్ సినీరంగంలోకి అడుగు పెట్టి గొప్ప విజయాల్ని అందుకున్నారు. తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. కానీ ఆయన సత్తా దేశం మొత్తం తెలిసింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే. ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో ఎంతటి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారో.. అదే రాజకీయాలు వలన చివరి రోజుల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఈ అంశాలన్నీ ఎన్టీఆర్ మహానాయకుడులో ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది.

జాగ్రత్తలు తీసుకుంటున్న బాలయ్య
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఇచ్చిన షాక్ తో కనీసం మహానాయకుడు అయినా ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కథలో అవసరమైన మార్పులు చేస్తూ, కొంత భాగం షూటింగ్ చేస్తున్నారట. విడుదల కొన్ని రోజులు ఆలస్యమైనా సినిమా అవుట్ పుట్ బావుండాలని బాలయ్య ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడి క్రిష్ ఈ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

మరోమారు వాయిదా
అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కథానాయకుడు చిత్రం నిరాశ పరచడం, ఇంకా కొంత భాగం షూటింగ్ ఉండడంతో ఫిబ్రవరి 14కు విడుదల వాయిదా వేశారు. ఆ ఆ తేదీన కూడా మహానాయకుడు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న కానీ, మార్చి 1న కానీ మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రానా పాత్ర
ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించాడు. కథానాయకుడు చిత్రంలో రానా పాత్ర పెద్దగా లేదు. ఎన్టీఆర్ మహానాయకుడుకులో బాలయ్య, రానా, కళ్యాణ్ రామ్ కలసి నటించే సన్నివేశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఎలా హైలైట్ చేశారనే ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











