కండీషన్స్ తోనే పవన్ పార్టీ మద్దతు
హైదరాబాద్: 'జనసేన' పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి తనకు ప్రత్యేకంగా సీట్లు అక్కర్లేదని... అభివృద్ధికి సంబంధించి తన ఆలోచనలకు ఆమోదం తెలిపి, అందుకు అనుగుణంగా హామీ ఇస్తే టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధమని స్పష్టం చేసినట్లు సినీ,రాజకీయ వర్గాల సమాచారం. ఆ ఆలోచనలు ఏమిటి,తెలుగు దేశం పార్టీ ఓకే అంటుందా అనేది చర్చనీయాంసంగా మారింది. పార్టీ నెలకొల్పిన తర్వాత ఎన్నికల్లో పాల్గొనడానికి మరీ తక్కువ వ్యవధి ఉండటంతో ఇప్పుడు అటువంటి ప్రయత్నాలేవీ చేయరాదని పవన్ భావిస్తున్నారు.
పవన్ ప్రతిపాదనలు ఏమిటీ అంటే...' గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి అంతా రకరకాల కారణాలతో హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. సీమాంధ్రలో ఈసారి అటువంటి పొరపాటు జరగరాదన్నది ఆయన అభిమతం. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని, అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందే వాతావరణం, అవకాశాలు, వసతులు కల్పించాలని ఆయన కోరుకొంటున్నారు.

దీంతోపాటు యువత కేవలం ఉద్యోగాలపై ఆధారపడే పరిస్థితి లేకుండా... సొంతంగా పరిశ్రమలు, స్వయం ఉపాధి చర్యలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన కోరుకొంటున్నారు. ఇవన్నీ త్వరలో ఆయన టీడీపీ ముందు పెడతారు. ఆ పార్టీ దానికి ఆమోదం తెలిపితే ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణలోనూ ఆయన ప్రచారం చేస్తారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా పవన్ ఒకటి రెండు ప్రతిపాదనలు ముందుకు తెచ్చే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రాభివృద్ధి ఎజెండాగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని 'జనసేన' నేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లేమీ అడగరాదని, తాను కూడా ఎక్కడా పోటీ చేయరాదని తీర్మానించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ ముందు తన ఆలోచనలు పెట్టి, వాటికి ఆ పార్టీ ఆమోదం తెలిపితే, వాటి ప్రాతిపదికగా పవన్ ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే పవన్ తన పార్టీని పకడ్బందీగా నిర్మించి... వీలైతే 2019 ఎన్నికల బరిలో దిగాలన్నది ఆయన ఆలోచన. అయితే... ఈసారి విజయవాడ లోక్‌సభ సీటును పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కు ఇవ్వాలని పవన్ సిఫారసు చేస్తున్న ప్రచారంపై స్పందించడానికి 'జనసేన' వర్గాలు ఇష్టపడటంలేదు. 'మాకు తెలిసినంతవరకూ అటువంటిదేమీ లేదు' అని చెబుతున్నారు. ఇక... బీజేపీతో పవన్ ఇంతవరకూ నేరుగా చర్చలేవీ జరపలేదని, టీడీపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకొంటే ఆ పార్టీ తరపున కూడా ప్రచారం చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











