Pawan Kalyan: పవన్ కళ్యాణ్ త్యాగం..‘ఉస్తాద్ భగత్ సింగ్’కు షాకింగ్ రెమ్యునరేషన్..
Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' ( Ustaad Bhagat Singh) . ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం 'ట్రైలర్ టీజ్' పేరుతో ఒక చిన్న వీడియోను విడుదల చేసింది. "ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత" అంటూ పవన్ చెప్పిన డైలాగ్ మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే.. టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పారితోషికం.
దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ చిత్రానికి పవన్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా భారీ పారితోషికం తీసుకునే స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. అయితే ఈసారి మాత్రం ఆయన చాలా తక్కువ పారితోషికంతోనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉగాది కానుకగా 'ఉస్తాద్ భగత్ సింగ్'
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్‌తో మంచి అనుబంధం ఉన్న ఈ బ్యానర్ మరోసారి ఆయనతో కలిసి పనిచేస్తోంది.
పవన్ కళ్యాణ్ పారితోషికం..
సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమాకు రూ.50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న ఈ కాలంలో, పవన్ కళ్యాణ్ మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం కేవలం రూ.25 కోట్ల పారితోషికం మాత్రమే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు పదేళ్ల క్రితమే మైత్రి మూవీ మేకర్స్ నుంచి పవన్ కళ్యాణ్ సుమారు రూ.5 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్ ఉంది. అయితే సినిమా ప్రారంభం కావడానికి చాలా ఆలస్యం కావడంతో, అదనపు పారితోషికం గురించి పెద్దగా డిమాండ్ చేయకుండా పవన్ నిర్మాతలకు సహకరించినట్లు తెలుస్తోంది.
పారితోషికాన్ని తక్కువగా తీసుకున్నప్పటికీ, సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కొంత శాతం తనకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. అంటే బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ విజయం సాధిస్తే పవన్‌కు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్ లో భాగమేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ఎన్నో కారణాలతో ఆలస్యమైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం వల్ల సినిమా షూటింగ్ అనేకసార్లు వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో కూడా నిర్మాతలు ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి సహకరించడంతో, వారికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ తక్కువ పారితోషికంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాతలు భారీ మొత్తాన్ని రికవర్ చేసే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. ఉగాది సందర్భంగా విడుదల కావడంతో పాటు వరుస సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రమోషన్లకు సిద్ధం
సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే కొత్త పాటలు విడుదల చేయడంతో పాటు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అలాగే విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తక్కువ పారితోషికంతో సినిమా చేయడానికి ఒప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
'ఇంత పెద్ద స్టార్ కూడా నిర్మాతల గురించి ఆలోచించడం గొప్ప విషయం' అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పారితోషికంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయినప్పటికీ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











