హాట్ టాపిక్ : ‘అత్తారింటికి దారేది' కథ ఇదేనా?
హైదరాబాద్ :పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం రేపు భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రం కథ అంటూ నెట్ లో ఓ కథ చక్కర్లు కొడుతోంది. అందులోనూ సినిమా లీక్ కావటంతో నిజమే అయ్యింటుందని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కథేమిటంటే...విదేశాలలో తన తాత (బొమన్ ఇరాని) వద్ద గౌతమ్ నందా(పవన్ కళ్యాణ్)జీవితాన్ని పార్టీలు హంగామాతో ఎంజాయ్ చేస్తూ ఉంటూంటాడు. ఓ రోజు అతనికి తనకో కుటంబం ఉందని, ముఖ్యంగా తన మేనత్త(నదియా)ఇండియాలో ఉంటుందని తెలుస్తుంది. దాంతో తన కుటుంబాన్ని కలవాలనకున్న అతను ఇండియా బయిలుదేరతాడు. అయితే ఆమెకు పొగరు జాస్తి అని తెలియటంతో దాన్ని ఆణగకొట్టడానికి ఆమె వద్ద డ్రైవర్ గా చేరతాడు. పనిలో పనిగా ఆమె కూతురు (సమంత)ని లైన్ లో పెడతాడు. అక్కడ నుంచి రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఈ క్రమంలో తన అత్తకు ఎలా బుద్ది చెప్పి...ఆమెలో మార్పు తీసుకువచ్చి ఆ కుటుంబాన్ని చక్కదిద్ది, తన అత్త కూతురుతో ఎలా సెటిలయ్యాడనేది మిగతా కథ.
కథగా గతంలో వచ్చిన ఎన్నో అత్త-అల్లుళ్ల సవాళ్ల కధలను గుర్తు చేసినా త్రివిక్రమ్ తనదైన పంచ్ లతో, పవన్ తన స్టైల్ తో ఓ కొత్తదనం తీసుకువచ్చి సినిమాని అదరకొట్టాడంటున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం గబ్బర్ సింగ్ ని మించి ఘన విజయం సాధిస్తుందంటున్నారు. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.
ఈచిత్రంలో నదియా , కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












