పవన్ కల్యాణ్ మరో సాహసం: జానీ, సర్ధార్ గబ్బర్ సింగ్ తర్వాత ఇలా.. ఈసారైనా హిట్ కొడతాడా!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అలాగే, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నాడు. దీంతో ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఇలా చాలా కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు. రీఎంట్రీలో మరింత ఉత్సాహంతో కనిపిస్తోన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఓ సాహసం చేస్తున్నాడట. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

రీఎంట్రీలో వరుస సినిమాలు
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' అనే చిత్రంతో కమ్‌బ్యాక్ అయిన ఈ స్టార్ హీరో.. ఇది పట్టాలపై ఉండగానే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'భీమ్లా నాయక్' అనే సినిమానూ చేశాడు. ఈ చిత్రాలకు మంచి స్పందనే దక్కింది.

ఆ సినిమాపైనే ఫోకస్ చేశాడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పలు చిత్రాలకు ఓకే చేసినప్పటికీ 'హరిహర వీరమల్లు' మూవీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రాబోతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ టార్గెట్ పెట్టుకున్నాడు.

హరీశ్ శంకర్‌తో భవదీయుడు
రీఎంట్రీ ఇస్తున్నప్పుడే పవన్ కల్యాణ్ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో తనకు గతంలో 'గబ్బర్ సింగ్' వంటి భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్‌తోనూ 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

కథ.. రోల్స్‌పై ఎన్నో వార్తలు
హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కలయికలో రాబోయే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ గురించి ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్ర కథ విషయంలో కొన్ని పుకార్లు వచ్చాయి. ఇది ఠాగూర్ తరహా సినిమా అని.. ఇందులో పవన్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నాడని అన్నారు. అలాగే, పోలీస్ ఆఫీసర్ కథ అని, పాలిటిక్స్ నేపథ్యంతో కూడిందని మరికొందరు చెప్పారు.

అప్‌డేట్ లేదు.. ఆగిపోయిందా
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ ఎప్పుడో ప్రారంభం అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. పైగా, ఈ మూవీ నుంచి అప్‌డేట్లు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుపై ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కల్యాణ్ మరో సాహసం
'భవదీయుడు భగత్ సింగ్' ఆగిపోయిందేమో అని ఢీలా పడిపోతోన్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా త్వరలోనే మొదలవుతుందట. అంతేకాదు, దీనికోసం పవన్ రైటర్‌గా మారి స్క్రిప్టును రెడీ చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇది కొత్తదా? హరీశ్ కథకే మార్పులు చేస్తున్నాడా? అన్నది తెలియలేదు.

రెండు డిజాస్టర్ల తర్వాత ఇలా
గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'జానీ', 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు రైటర్‌గా పని చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ రెండు మూవీలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ అదే తరహా సాహసం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన అభిమానులు ఈ సారైనా పవర్ స్టార్ హిట్ కొడతాడని ఆశాభావంతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











