పవన్ ‘వీరమల్లు’ యాక్షన్ సీక్వెన్స్ లీక్: జాగ్రత్త పడడంతో తప్పిన ప్రమాదం.. ఆ వీడియోలో ఏముందంటే!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్పీడుతో దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. అది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను సైతం ప్రకటించాడు. అందులో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే 'హరిహర వీరమల్లు' ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ పిరియాడిక్ సినిమా నుంచి తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ వీడియో లీక్ అయింది. దీంతో చిత్ర యూనిట్ వెంటనే జాగ్రత్త పడడంత పెద్ద ప్రమాదమే తప్పింది. అసలు ఆ వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు మీకోసం!

అలా వెళ్లి.. ఇలా రీఎంట్రీ ఇచ్చిన పవన్
ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే దాదాపు మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాకు హిట్ అయింది. కానీ, పలు ఆటంకాలు ఎదురు అవడం వల్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేకపోయింది.

కెరీర్‌లో మొదటిసారి ఆ తరహా సినిమా
పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ సినిమా పిరియాడిక్ జోనర్‌లో వస్తోంది. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కెరీర్‌లోనే తొలిసారి ఇలాంటి ప్రయోగం చేస్తున్నాడు పవర్ స్టార్.

ఎన్నో సాహసాలు చేస్తున్న పవర్ స్టార్
మొగల్ కాలం నాటి కథాంశంతో రాబోతున్న 'హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకే దీని కోసం అతడు గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాముల్లో శిక్షణ తీసుకున్నాడట. అలాగే, ఎంతో ఇష్టమైన గన్ షూటింగ్ కూడా ఇందులో ఉందట. ఇక, ఈ సినిమా కోసం పవన్ కొన్ని రిస్కీ షాట్స్ చేస్తున్నాడని టాక్.

ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తున్నారు
పూర్వ కాలం నాటి కథ కావడంతో 'హరిహర వీరమల్లు' మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. దీనికి కారణం ఈ సినిమా కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణానికి సంబంధించిన సెట్స్ వేయడమే. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

దాని వల్ల అంచనాలు... అప్పుడే ఆఫర్లు
'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను మహా శివరాత్రికి విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లిమ్స్‌కు పవన్ అభిమానుల నుంచే కాక, సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఊహించని రీతిలో స్పందన రావడంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో దీనికి భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి.

పవన్ ‘వీరమల్లు' యాక్షన్ సీక్వెన్స్ లీక్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమాలో ఎన్నో హైలైట్లు ఉంటాయని చిత్ర యూనిట్ ఆరంభంలోనే చెప్పింది. మరీ ముఖ్యంగా ఇందులో పోరాటాలు అదిరిపోయేలా డిజైన్ చేస్తున్నారు. దానికి టీజర్‌లో చూపించిన విజువల్సే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్‌ను సంబంధించిన వీడియో బయటకు వచ్చిందని తెలిసింది.

తప్పిన ప్రమాదం.. అందులో ఏముంది?
ఓ సన్నివేశంలో భాగంగా పవన్ కల్యాణ్ సినిమాలో మల్లయోధులతో పోరాటం చేస్తాడట. దీనికి సంబంధించిన వీడియోనే లీక్ అయిందని తెలిసింది. అయితే, చిత్ర యూనిట్ వెంటనే జాగ్రత్త పడడంతో అది ఇంటర్నెట్‌లో వైరల్ అవకముందే డిలీట్ చేసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఇక, దీనికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచారని టాక్.


Click it and Unblock the Notifications











