పవన్‌తో వకీల్ సాబ్ డైరెక్టర్ మూవీ.. ఇప్పట్లో కుదిరే అవకాశమే లేదట?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.. చాలా రోజుల తర్వాత పవన్ కనిపించడం, పవన్ కి తగ్గట్టు సినిమా కథ కూడా ఉండడంతో ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. హిందీలో హిట్ అయిన పింక్ సినిమాకు ఇది రీమేక్ అని తెలియడంతో అలాంటి సినిమా ఇక్కడ ఆదరిస్తారా లేదా అనే టెన్షన్ వారిలో ఉంది.
దానికి తగ్గట్టుగా ఏదో పెద్ద దర్శకుడికి సినిమా ఇస్తారు అనుకుంటే రెండు మూడు సినిమాలు చేసిన అనుభవం ఉన్న వేణు శ్రీరామ్ కి ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ మరింత నిరాశలో కూరుకుపోయారు.. కానీ ఎప్పుడైతే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిందో దెబ్బకు పవన్ ఫ్యాన్స్ బాధలు అన్నీ తీరిపోతాయి. సాటి పవన్ ఫ్యాన్ అయిన వేణు శ్రీరామ్ పుణ్యమాని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని పవన్ కళ్యాణ్ స్వయంగా తన కోసం మరో కథ సిద్ధం చేయాలని ఆయనను కోరారనే ప్రచారం జరిగింది.

అదీకాక దిల్ రాజు, పవన్ కళ్యాణ్ ను కలిసి అడ్వాన్స్ ఇచ్చాడని ప్రచారం జరగడంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా కచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే తాజా సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎలాంటి కొత్త ప్రాజెక్టు ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి మరో మూడు సినిమాల్లో అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి ఈ సినిమాలు ఒక కొలిక్కి వచ్చాక అప్పుడు ఫైనల్ చేస్తారని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి చేసే అవకాశం ఉండవచ్చు కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications










