పవన్ కళ్యాణ్ పార్టీ గీతం ఇదే...
హైదరాబాద్ :పవన్‌కల్యాణ్ రాజకీయ తెరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. ముహూర్తం శుక్రవారం రాత్రి. 'జనసేన' పేరుతో తను ప్రారంభించే పార్టీ సిద్ధాంతాలనీ, తన రాజకీయ ఆలోచనల్నీ ఈ రోజు అభిమానుల సమక్షంలో వెల్లడించబోతున్నారు. పవర్ స్టార్ తన పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ఒక్కరోజు ముందే... జెండా, నినాదం, గీతం అన్నీ అనధికారికంగా విడుదలయ్యాయి.
'తూర్పు దిక్కు ఎరుపెక్కి... మార్పుకోసం తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన... కళ్లుతెరిచి ఎలుగెత్తి, కుళ్లు కడుగ యువశక్తి... నిలదీసే శక్తే ఈ జనసేన!'... ఇది పవన్ కల్యాణ్ పార్టీ గీతం. 'హక్కుల కోసం పోరాడు' (ఫైట్ ఫర్ రైట్)... ఇది పవన్ కల్యాణ్ పార్టీ నినాదం.

పవన్‌కల్యాణ్ కొత్తగా స్థాపించబోయే పార్టీకి సంబంధించి ప్రకటన కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 14వ తేదీన పవన్‌కల్యాణ్ చేసే ప్రసంగం ప్రత్యక్షంగా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ఖమ్మం, వరంగల్, బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పార్టీ గురించి పవన్‌కల్యాణ్ ఏం చెప్తారా? అనే విషయంపై ఆయన అభిమానులతో పాటు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
పార్టీ ఆవిర్భావ సమావేశానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) ఆవరణలోని నోవాటెల్ హోటల్‌ను వేదికగా ఎంచుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ తెరలు ఏర్పాటు చేసి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవన్ ప్రసంగం చూసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఎంపిక చేసిన ఆరువేల మంది అభిమానులను ఆహ్వానించినట్లు తెలిసింది. వీరందరికీ ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. రాజకీయ నాయకులకీ, సినీ ప్రముఖులకీ ఎలాంటి ఆహ్వానాలు అందలేదని సమాచారం. ఇప్పటికే నోవాటెల్ ప్రాంగణంలో పవన్ పార్టీ వర్గాలు ఏర్పాట్లను చురుగ్గా సాగిస్తున్నాయి.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/eHm4OlPyuCE" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications











