‘అల్లూరి సీతారామరాజు’గా హీరో ప్రభాస్!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'అల్లూరి సీతారామ రాజు'గా తెరపై కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయిరు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఈ చిత్రాన్ని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు నిర్మించబోతున్నారట.
ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి' షూటింగులో పాల్గొంటున్నాడు. బాహుబలి షూటింగ్ చూడటానికి వచ్చిన కృష్ణం రాజు యుద్ధ వీరుడి గెటప్‌లో ప్రభాస్‌ను చూసి చాలా ఆనంద పడ్డాడని....అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రభాస్ బాగా సూటవుతాడని అభిప్రాయ పడ్డట్లు సమాచారం.
వాస్తవానికి కృష్ణం రాజు ఫాంలో ఉన్నపుడే అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని భావించారు. అయితే అది వీలు కాలేదు. తను చేయలేని ఆ పాత్రను ప్రభాస్‌తో చేయించాలనుకుంటున్నారట కృష్ణం రాజు.

70ల్లో సీనియర్ ఎన్టీఆర్ 'అల్లూరి సీతారామరాజు' సినిమా చేయాలని భావించారు. పలు కారణాలతో ఆ సినిమా తెరకెక్కలేదు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సినిమాను పూర్తి చేసారు. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం సాధించింది. పలు అవార్డులను గెలుచుకుంది. తెలుగు సినిమా చరిత్రలో మరుపురాని చిత్రరాజంగా నిలిచిపోయింది.
తాజాగా కృష్ణం రాజు ఈ సినిమాను ప్రభాస్‌తో మళ్లీ చేయాలని నిర్ణయించడం ఆసక్తి కరంగా మారింది. బాహుబలి చిత్రం తర్వాత ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఆచరణకు నోచుకుంటుందా? లేదా? దర్శకుడు ఎవరు? అనేది త్వరలో తేలనుంది.


Click it and Unblock the Notifications











