మోహన్ బాబు కొడుకుగా ప్రభాస్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోహన్ బాబు కొడుకుగా నటించబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సినీ వర్గాల నుంచి. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు త్వరలో 'రావణ బ్రహ్మ' అనే చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో మోహన్ బాబు టైటిల్ రోల్ చేస్తుండగా, ప్రభాస్ ఆయన కొడుకు ఇంద్రజిత్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాఘవేంద్రరావు నాగార్జునతో 'షిరిడి సాయి' చిత్రం రూపొందిస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నాటకలో జరుగుతోంది. గతంలో నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి విజయవంతమైన భక్తిరస చిత్రాలను రూపొందించిన రాఘవేంద్రరావు మరోసారి అదే రేంజ్ హిట్ కొట్టాలనే లక్ష్యంగా 'షిరిడి' సాయి చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇక ప్రభాస్ రెండు చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్' సినిమాతో పాటు, కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన అనంతరం రాఘవేంద్రరావు ప్రాజెక్టులో నటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











