Raja Deluxe: ప్రభాస్ సినిమాపై మారుతి డైలమా.. భారీ ప్రాజెక్టు నుంచి షాకింగ్ న్యూస్
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతూ హవాను చూపిస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే, దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' అతడి రేంజ్ పాన్ ఇండియాకు చేరింది. దీంతో అప్పటి నుంచి మనోడు నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ప్రభాస్ మరింత ఉత్సాహంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలోనే మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకోవడంతో పాటు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు, ఇప్పుడు మరికొన్ని కథలను కూడా వింటూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాధాకృష్ణ కుమార్ రూపొందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేశారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను పోషించాడు. దీనికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రభాస్‌కు నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. ఇది ఫుల్ రన్‌లో కేవలం రూ. 83 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా నిర్మాతలకు ఏకంగా రూ. 120 కోట్ల నష్టాలను మిగిల్చింది.

ఇక, ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. వీటితో పాటు ఎంతో మంది దర్శకులతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో 'రాజా డీలక్స్' అనే సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ లీకైన విషయం తెలిసిందే. దీనిపై అటు ప్రభాస్ కానీ, ఇటు మారుతి కానీ క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం అని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు హర్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కనుందని అంటున్నారు. రొమాంటిక్ లైన్‌తో నడిచే ఈ సినిమాను అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునేలా రూపొందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, అది అయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అన్నారు. అయితే, ఇటీవలే తండ్రిని కోల్పోయిన మారుతి.. ఈ స్క్రిప్ట్ వర్క్‌ను ఆలస్యం చేస్తున్నారట. దీంతో ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'రాజా డీలక్స్' మూవీలో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌ను చేస్తున్నట్లు ఇప్పటికే ఓ వార్త వైరల్ అయింది. అంతేకాదు, ఇందులో ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











