Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. అప్పటికి వాయిదా వేస్తూ నిర్ణయం
పేరుకు టాలీవుడ్ హీరోనే అయినా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ నేషనల్ స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' సిరీస్ తర్వాత తన స్థాయిని భారీగా పెంచుకున్న అతడు.. వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి. అందులో 'సలార్: సీజ్‌ఫైర్' ఒకటి.
కేజీఎఫ్‌తో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'సలార్: సీజ్‌ఫైర్'. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని చిత్ర యూనిట్ ఇటీవలే విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ట్రైలర్‌ను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
'సలార్: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో ఇటీవల చిత్ర యూనిట్ 'మీ క్యాలెండర్‌లో ఆగస్టు నెలను మార్క్ చేసి పెట్టుకోండి. భారతీయ సినిమా ప్రభావాన్ని చాటి చెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ మీకోసం వస్తుంది' అని అధికారికంగా ప్రకటన వదిలింది. దీంతో ఈ మూవీ ట్రైలర్ ఈ నెలలోనే వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.
ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం... 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించిన ట్రైలర్ ఆగస్టులో విడుదల కావడం లేదట. దీన్ని సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని యూనిట్ ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతుందని అంటున్నారు. దీంతో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.

ఇక.. 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











